ఈ నెల 24 నుంచి పీవీ శత జయంతి వేడుక‌లు

ఈ నెల 24 నుంచి పీవీ శత జయంతి వేడుక‌లు

పీవీ మా వాడు, 100% కాంగ్రెస్ వాది: ఉత్తమ్ 

పీవీ శతజయంతి వేడుక‌లు చేసుకోవడం త‌మ‌కు గర్వంగా ఉంద‌ని చెప్పారు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీ భవన్‌లో నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు 100% కాంగ్రెస్ వాది అని అన్నారు. సామాన్య కాంగ్రెస్ కార్తకర్త నుంచి ఎమ్మెల్యే గా, మంత్రి గా, పీసీసీ చీఫ్ గా, సీఎం గా , కేంద్ర మంత్రిగా, ప్రధానిగా పనిచేశార‌న్నారు. పీవీ మా వాడని గ‌ర్వంగా చెబుతున్నామ‌ని అన్నారు. జులై 24న‌ ఇందిరా భవన్‌లో పీవీ జ‌యంతి ప్రారంభ ఉత్సవాలు నిర్వహిస్తున్నామ‌ని, పీవీ మనోహర్ రావు జయంతి ఉత్సవాల ప్యాట్రన్ గా ఉన్నార‌న్నారు. జూమ్ యాప్ ద్వారా 1000 మంది పాల్గొనేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

జూమ్ యాప్ ద్వారా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ మంత్రులు చిదంబరం, జై రాం రమేష్‌లు మాట్లాడతారని ఉత్తమ్ మీడియాకు వెల్లడించారు. సోనియా, రాహుల్ గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ, శరద్ పవార్ లు తమ సందేశాలు పంపిస్తార‌ని తెలిపారు. పీవీ కుటుంబ సభ్యలు కూడా హాజరవుతారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సంవత్సరం మొత్తం పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తామ‌ని తెలిపారు.

అలాగే జులై 26న తెలంగాణలో దళితులపై జ‌రిగిన దాడులపై నిరసనగా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చలో మల్లారం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఉత్త‌మ్ తెలిపారు. భూపాలపల్లి జిల్లా మల్లారంలో దళిత యువకుడు రెవెలి రాజబాబు హత్య కు నిరసనగా చలో మల్లారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామ‌ని తెలిపారు. గాంధీభవన్‌లో చలో మల్లారం పోస్టర్‌ను ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు.