మాల్స్​కు జనం వస్తలే .. 40 శాతానికిపైగా ఖాళీగానే

మాల్స్​కు జనం వస్తలే .. 40 శాతానికిపైగా ఖాళీగానే

న్యూఢిల్లీ: రిటైలర్లు,  వినియోగదారులు ప్రీమియం ప్రాపర్టీలను ఇష్టపడుతున్నందున మాల్స్​లో 40 శాతానికిపైగా ఘోస్ట్ షాపింగ్ మాల్స్​గా మారాయి. నిరుపయోగంగా పడి ఉన్న వాటిని ఘోస్ట్​ షాపింగ్​మాల్స్​అని పిలుస్తారు. మనదేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 2022లో వీటి సంఖ్య 57 నుంచి గత ఏడాది 64కి పెరిగింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా మంగళవారం 'థింక్ ఇండియా థింక్ రిటైల్ 2024' పేరుతో 29 నగరాల్లోని షాపింగ్ సెంటర్లపై ఒక రిపోర్ట్​ను విడుదల చేసింది. 

దీని ప్రకారం ఎనిమిది ప్రధాన నగరాల్లో రిటైల్ ఆస్తుల పనితీరు సంతృప్తికరంగా లేదు. దాదాపు 13.3 మిలియన్ చదరపు అడుగుల స్థూల లీజు ప్రాంతంలోని 64 షాపింగ్ మాల్స్​ను 2023లో 'ఘోస్ట్ షాపింగ్ సెంటర్'గా వర్గీకరించారు. విస్తీర్ణపరంగా, ఇది మునుపటి సంవత్సరంలో 8.4 మిలియన్ చదరపు అడుగులతో పోలిస్తే 58 శాతం పెరిగింది. ఘోస్ట్ షాపింగ్ కేంద్రాల విలువ 2023లో విలువ రూ. 6,700 కోట్లు లేదా  798 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.

హైదరాబాద్​లో తగ్గుదల

హైదరాబాద్​మినహా అన్ని నగరాల్లోనూ పరిస్థితి బాగా లేదు. ఢిల్లీ– ఎన్సీఆర్​లో ఘోస్ట్ షాపింగ్ సెంటర్ స్టాక్‌‌‌‌‌‌‌‌ అధికంగా ఉంది. ఇక్కడ 53 లక్షల చదరపు అడుగుల్లో (సంవత్సరానికి 58 శాతం పెరుగుదల) మాల్స్​ ఖాళీగా ఉన్నాయి. ముంబై 21 లక్షల చదరపు అడుగుల (వార్షికంగా 86 శాతం పెరుగుదల) జాగా, బెంగళూరులో  20 లక్షల చదరపు అడుగులు (46 శాతం పెరుగుదల) ఖాళీగా ఉన్నాయి.  హైదరాబాద్​లో 2023లో ఘోస్ట్ షాపింగ్ సెంటర్ స్టాక్ 19 శాతం క్షీణించి 0.9 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. 

ఘోస్ట్ షాపింగ్ సెంటర్లలో అత్యధిక పెరుగుదల కోల్‌‌‌‌కతాలో (237 శాతం వార్షికంగా) నమోదయింది. టాప్ 8 నగరాల్లోని మొత్తం 64 ఘోస్ట్ మాల్స్‌‌‌‌లో ఢిల్లీ–-ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌లో 21, బెంగళూరులో 12, ​​ముంబైలో 10, కోల్‌‌‌‌కతాలో 6, హైదరాబాద్‌‌‌‌లో 5, అహ్మదాబాద్‌‌‌‌లో 4,  చెన్నైలో 3, పూణేలో 3 మాల్స్​ఖాళీగా ఉన్నాయి.  నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ మాట్లాడుతూ గ్రేడ్ సి ఆస్తులు  ఘోస్ట్ షాపింగ్ కేంద్రాలుగా మారుతున్నాయని, ఏ గ్రేడ్​ఆస్తులకు డిమాండ్​ కొనసాగుతోందని చెప్పారు. గత సంవత్సరంలో 16 షాపింగ్ కేంద్రాలను మూసివేయడంతో మొత్తం షాపింగ్ కేంద్రాల సంఖ్య 263కి తగ్గిందని వివరించారు.