పెద్దగట్టు జాతర షురూ

పెద్దగట్టు జాతర షురూ
  • భారీగా తరలివచ్చిన భక్తులు

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతర ఆదివారం రాత్రి ప్రారంభమైంది. గంపలు, బోనాలు తలపై పెట్టుకొని, కటారీలు చేతపట్టుకొని.. భేరీలు మోగిస్తూ.. కాళ్లకు గజ్జెలు కట్టి నృత్యాలు చేస్తూ భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించారు. మొదటి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు సారలమ్మకు, నాగదేవతకు, ఎల్లమ్మ తల్లికి పూజలు చేశారు. శనివారం గొల్లబజార్‌లోని యాదవుల కుల దేవాలయం నుంచి మకర తోరణాన్ని దురాజ్‌పల్లి గుట్టకు తరలించగా ఆదివారం అర్ధరాత్రి కేసారం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవర పెట్టెని తీసుకొని మెంతబోయిన, గొర్ల, మున్నా వంశస్తులు కాలినడకన దురాజ్ పల్లి చేరుకొని పూజలు నిర్వహించారు. లింగా ఓ లింగా నామస్మరణతో గంపలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మెంతబోయిన, గొర్ల, మున్నా వంశస్తులు రెండు బోనాలను సమర్పించారు. దీనితో మొదటి రోజు ఘట్టం ముగిసింది.

పలు జిల్లాల నుంచి భక్తుల రాక

మొదటి రోజు పెద్దగట్టుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. మేడారం సమ్మక్క- సారలమ్మల జాతర తర్వాత తెలంగాణలో అతిపెద్దదైన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్‌ జిల్లాలు, అలాగే ఏపీలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని, భక్తులు స్నానం చేయడానికి షవర్లు, అతిథి గృహాలను కూడా అందుబాటులో ఉంచామని, జాతరలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్త్ ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు.

ట్రాఫిక్​ మళ్లింపు

జాతర సందర్భంగా 65వ జాతీయ రహదారిపై ఆదివారం నుంచి భారీ వెహికల్స్​ను దారి మళ్లించారు. మార్చి4  వరకు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా విజయవాడకు వెళ్లే వెహికల్స్​ను నల్గొండ జిల్లా నార్కెట్‎పల్లి నుంచి నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ వైపు దారి మళ్లించారు. అలాగే, విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్లే వెహికల్స్​ను కోదాడ వద్ద హుజూర్‎నగర్ మీదుగా మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్ పల్లి వైపు మళ్లించారు. జాతర సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని  ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సోమ, మంగళవారం సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాతరలో మంత్రి జగదీశ్​రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్​ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

లాభాల్లో ఉన్నా ప్రైవేటైజేషన్.. ఎవరి కోసం?

రోజుకో యాపిల్ తినడం మంచిదేనా?

వ్యక్తిని కట్టేసి కొట్టిన నలుగురు అరెస్ట్​

నిలోఫర్ లో 3 నెలలుగా జీతాల్లేవ్