మోదీ ప్రకటన వల్లే.. వాహనదారుల్లో ప్యానిక్: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

మోదీ ప్రకటన వల్లే.. వాహనదారుల్లో ప్యానిక్: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై పార్లమెంట్ వేదిక గా ప్రధాని మోదీ చేసిన స్టేట్మెంట్ దేశ ప్రజల్లో భయాందోళనలు నింపిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ‘‘దేశంలో మరోసారి కరోనా కాలం నాటి కఠిన పరిస్థితులు రాబోతున్నట్లు కన్పిస్తున్నది. చాలా భయంకర పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి’’ అని మోదీ వ్యాఖ్యానించారని అన్నారు. ఈ కామెంట్లతో ఆయన దేశ ప్రజల్ని భయాకన పరిస్థితుల్లోకి నెట్టారని విమర్శించారు. దీంతో పెట్రోల్, వంటగ్యాస్ (ఎల్పీజీ) కొరత పై దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైందని తెలిపారు. వాహనాల్లో పెట్రోల్ నింపుకునేందుకు ప్రజలు బంకులకు పోటెత్తుతున్న విజువల్స్ చూస్తున్నామని చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణలో పెట్రోల్ కొరత కూడా తీవ్ర సమస్యగా మారిందన్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పారు. వీటన్నింటికి కారణం ప్రధాని మోదీ ఇచ్చిన స్టేట్మెంటే అని మండిపడ్డారు.

పెట్రోల్, డీజిల్​పై సుంకం(ట్యాక్స్) తగ్గించి ప్రజలకు ఏదో మేలు చేసినట్టుగా చెప్పుకునేం దుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. గత పదేండ్లలో క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు.. ప్రజలపై మోపిన అత్యధిక సుంకాల సంగతి ఏంటని ప్రశ్నించారు.  ‘యూపీఏ హయాంలో ఒక బ్యారెల్ పెట్రోల్ ధర 100 డాలర్లు ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రూ.60 కే లీటర్ పెట్రోల్ అందించింది. కానీ కొద్ది రోజుల కింది వరకు అతి తక్కువగా ఒక బ్యారెల్ ధర 50 డాలర్లు ఉన్నా.. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ సర్కార్ సుంకాలు భారీగా పెంచి ఒక లీటర్ పెట్రోల్ ధర రూ.100 చేసింది. గత పదేండ్లుగా ఈ భారీ ట్యాక్స్ (సుంకాల) రూపంలో దాదాపు రూ.20 లక్షల కోట్ల నుంచి రూ.30 లక్షల కోట్లను సామాన్యుల నుంచి దం డుకుంది. కానీ ఈ రోజు ప్రజలకు ఏదో చేస్తున్నాం అన్నట్లు.. సుంకాలను తగ్గించినట్లు గొప్పలు చెప్పుకుంటుంది. మరి ఈ రూ.20 లక్షల కోట్ల నుంచి రూ.30 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? ఎవరి ప్రయోజనం కోసం వినియోగించారు. ఈ అంశాలన్నింటిపై మోదీ సర్కార్ సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.