చనిపోయిన వారి పేరుతో.. ఆసరా పెన్షన్లు కాజేసిన అధికారులు

చనిపోయిన వారి పేరుతో.. ఆసరా పెన్షన్లు కాజేసిన అధికారులు

మహబూబాబాద్ ​జిల్లా దంతాలపల్లి మండలంలో చనిపోయిన వారి పేరుతో పింఛన్లు స్వాహా అవుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గున్నేపల్లి గ్రామంలో వివిధ కారణాలతో కొందరు ఆసరా లబ్ధిదారులు చనిపోయారు. గ్రామంలో మృతి చెందిన వారి పేర్లను పంచాయతీ రికార్డుల్లో అధికారులు నమోదు చేయాలి. పింఛనుదారులు మృతి చెందితే.. వారి పేర్లు లిస్టు నుంచి తీసివేయాలి. కానీ ఇక్కడ అధికారులు అలా చేయలేదు. మృతి చెందిన వారిలో కొందరి పేరిట వస్తున్న పింఛను.. అధికారులు స్వాహా చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

స్థానిక పోస్టు మాస్టర్, గ్రామ పంచాయితీ కార్యదర్శి కలిసి పన్నాగం వేసి ఆసరా పెన్షన్లు కాజేస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు రంగంలోకి దిగారు. పెన్షన్ల అవకతవకలుపై అధికారులు విచారణ చేపట్టారు. చనిపోయిన లబ్ధిదారుల పేరుతో పంచాయితీ కార్యదర్శి వేలి ముద్రలతో పెన్షన్ డబ్బులు కాజేసినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు సుమారుగా రూ. రెండు లక్షల ఎనభై వేల పైన డబ్బులు మాయం చేశారని విచారణలో తెలింది.

చనిపోయిన వారి జాబితా రికార్డులు పొందుపరచకుండా పెన్షన్ కాజేసినట్టు.. పోస్ట్ మాస్టర్, కార్యదర్శి ఈ తతంగం నడిపినట్టు అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు సదరు లబ్ధిదారులు ఎప్పుడు చనిపోయారు? ఎన్ని నెలల పింఛన్‌ పక్కదారి పట్టింది? అనే వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఈ వ్యవహారం ఎన్నెలుగా జరుగుతుందని అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ మేరకు విచారణ కొనసాగుతున్నది. పూర్తి విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

కాగా, అర్హులైన నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులకు అండగా ఉండేలా ప్రభుత్వం ఆసరా పథకం ద్వారా ప్రతి నెల పింఛన్లు ఇస్తోంది. దివ్యాంగులకు రూ.3016, మిగతా వారికి నెలకు రూ.2016 చొప్పున పింఛన్లు ఇవ్వడం జరుగుతోంది. ఈ ప్రక్రియను ప్రభుత్వం పోస్టల్​ శాఖకు అప్పగించగా.. ఆయా సిబ్బంది గ్రామాల్లో అర్హులకు డబ్బులను అందిస్తున్నారు.