స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పిస్తాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

స్థానిక సంస్థల్లో  దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పిస్తాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పిస్తామని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు. ఈ ప్రతిపాదనను ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లామని ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆదివారం జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన నియోఫ్లై బోల్ట్ యాక్సెసిబిలిటీ డివైజ్‌‌‌‌‌‌‌‌ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పాల్గొన్నారు. వెన్నెముక గాయాల బారిన పడిన దివ్యాంగులు, ఇతర తీవ్ర వైకల్యం కలిగిన 90 మంది లబ్ధిదారులకు అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ మొబిలిటీ పరికరాలను మంత్రి అడ్లూరి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, కాంగ్రెస్ నేత చిన్న శ్రీశైలం యాదవ్ అందజేశారు. సీఎస్ఆర్ నిధుల్లో భాగంగా 'హ్యుందాయ్ మొబీస్' సంస్థ సుమారు రూ.1.26 కోట్ల వ్యయంతో.. ఒక్కోటి రూ.1.40 లక్షల విలువైన నియోఫ్లై బోల్ట్ పరికరాలను పంపిణీ చేసింది. 

వికలాంగులకు త్వరలోనే సంక్షేమ భవన్

వికలాంగ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి అడ్లూరి హామీ ఇచ్చారు. నాంపల్లి గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వికలాంగుల కోసం త్వరలోనే  ప్రత్యేక సంక్షేమ భవన్ నిర్మిస్తామని, ఇందిరమ్మ ఇండ్లలో రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి వెల్లడించారు.