ఇండియాకు త్వరలో ఫైజర్‌ వ్యాక్సిన్‌

ఇండియాకు త్వరలో ఫైజర్‌ వ్యాక్సిన్‌

అనుమతి ప్రక్రియ ఫైనల్‌ స్టేజ్‌లో ఉంది: కంపెనీ సీఈవో
జులై నుంచి అక్టోబర్‌ మధ్యలో 5 కోట్ల డోసుల పంపిణీకి రెడీ

న్యూఢిల్లీ: ఫైజర్‌ వ్యాక్సిన్‌కు ఇండియాలో త్వరలోనే అనుమతి వస్తుందని కంపెనీ సీఈవో అర్బర్ట్‌ బౌర్లా వెల్లడించారు. మంగళవారం 15వ యాన్యువల్‌ బయో ఫార్మా అండ్‌ హెల్త్‌ కేర్‌ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. అప్రూవల్‌ ప్రాసెస్‌ ఫైనల్‌ స్టేజ్‌లో ఉందన్నారు. టీకాల పంపిణీకి సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. ఫైజర్‌, మోడర్నా వ్యాక్సిన్లకు అనుమతిని ఇండియా పరిశీలిస్తోందని నీతి ఆయోగ్‌ మెంబర్‌ వీకే పాల్‌ ఈమధ్యే చెప్పారు. అంతర్జాతీయ రెగ్యులేటరీ సంస్థలు అనుమతిచ్చిన వ్యాక్సిన్లకు దేశంలో ప్రత్యేకంగా ట్రయల్స్‌ అవసరం లేదని డీసీజీఐ కూడా ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫైజర్‌కు త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. జర్మన్‌ ఫార్మా కంపెనీ బయో ఎన్‌టెక్‌తో కలిసి అమెరికా కంపెనీ ఫైజర్‌ టీకాను డెవలప్‌ చేసింది. ఈ వ్యాక్సిన్‌ కరోనాను 90 శాతం వరకు నిలువరించగలదని రిపోర్టులు చెబుతున్నాయి. ఇండియాలోని కరోనా రకాన్ని కూడా ఫైజర్‌ నిలువరించగలదని కంపెనీ చెబుతోంది. 12 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇవ్వొచ్చని వివరించింది. 28 డిగ్రీల టెంపరేచర్‌లో నెల రోజుల వరకు నిల్వ ఉంటుందంది. జులై, అక్టోబర్‌ మధ్య ఇండియాకు 5 కోట్లు డోసులను ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని చెప్పింది. తమ టీకా తీసుకున్న వ్యక్తులు దుష్ప్రభావానికి గురైనప్పుడు నష్టపరిహారం చెల్లింపు నుంచి తమకు మినహాయింపునివ్వాలని కేంద్రాన్ని ఇదివరకే ఫైజర్‌ కోరింది.