మేడిపల్లి పీఎస్ లో కేసు ...ఫార్మసీ సిబ్బంది నిర్లక్ష్యం.. బాలుడి కళ్ల వెంట రక్తం

మేడిపల్లి పీఎస్ లో కేసు ...ఫార్మసీ సిబ్బంది నిర్లక్ష్యం.. బాలుడి కళ్ల వెంట రక్తం
  •     కంటి మందుకు బదులు చర్మ మందు ఇవ్వడంతో గాయం

మేడిపల్లి, వెలుగు: మెడికల్ షాపు సిబ్బంది చేసిన ఘోర తప్పిదానికి ఐదేండ్ల బాలుడి కళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కంటి మందుకు బదులు చర్మ వ్యాధికి వాడే మందు ఇవ్వడంతో బాలుడి కళ్ల వెంట రక్తం, నీరు కారడం ప్రారంభమయ్యాయి. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని వినాయకనగర్ కాలనీకి చెందిన చింతకాయల వినోద్ కుమార్ తన కొడుకు సిద్ధార్థ కార్తికేయ(5)కు కంటి వైద్యం కోసం గత నెల 29న బీబీనగర్ ఎయిమ్స్ కు తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్లు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్​ను మేడిపల్లి అపోలో ఫార్మసీలో చూపించగా, సిబ్బంది కంటి మందుకు బదులుగా చర్మ వ్యాధికి వాడే ఆయింట్​మెంట్​ను ఇచ్చారు. 

అది కంటి మందేనని నమ్మి ఈ నెల 15న బాలుడి కళ్లల్లో వేయడంతో తీవ్ర ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో కళ్ల వెంట రక్తం, నీరు కారడం ప్రారంభమైంది. ఫార్మసీ సిబ్బంది నిర్లక్ష్యంపై వినోద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.