- నార్వేతో 'గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్'కు హోదా పెంపు
- ఇండియా-నార్డిక్ 3వ సమిట్‌లో పాల్గొన్న ప్రధాని
ఓస్లో:యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్ పర్యటనల తర్వాత నార్వే చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఓస్లోలో జరిగిన ఇండియా–నార్డిక్ 3వ సమ్మిట్‌కు హాజరయ్యారు. ఐదు నార్డిక్ దేశాలు నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, స్వీడన్ దేశాల ప్రధానులతో ఈ సమ్మిట్ జరిగింది.
సమ్మిట్‌కు ముందు ఐస్‌లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల నేతలతో మోదీ విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నార్వే ప్రధాని జోనాస్ గాహర్ స్టోరేతో భేటీలో భారత్-నార్వే సంబంధాలను ‘గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్’కు అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు.
క్లీన్ ఎనర్జీ, సుస్థిర వృద్ధి, బ్లూ ఎకానమీ, గ్రీన్ షిప్పింగ్ రంగాల్లో కలిసి పనిచేయనున్నట్టు చెప్పారు. ఈ భేటీలో నార్వేతో 12 ఒప్పందాలు కుదిరాయి. నార్వే ఇండో–పసిఫిక్ మహాసముద్ర సహకారంలో భాగమైంది. అంతరిక్ష సహకారం కోసం ప్రత్యేక ఒప్పందం కుదిరింది. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ పబ్లిక్ గూడ్స్ కోసం ఇండియా–నార్వే డిజిటల్ డెవలప్‌మెంట్ పార్ట్నర్‌షిప్ ప్రారంభమైంది.
2027లో జరిగే నోర్- షిప్పింగ్ వేదికలో ఇండియా పెవిలియన్ ఏర్పాటుకు కూడా అంగీకారం కుదిరింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఐస్‌లాండ్‌తో జరిగిన చర్చల్లో క్రియేటివ్ ఎకానమీ, పీపుల్-టు-పీపుల్ ఎక్స్ఛేంజెస్‌తో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారని తెలిపారు. ఫిన్లాండ్‌తో జరిగిన భేటీలో మొబిలిటీ, విద్య అంశాలు చర్చకు వచ్చాయని, ఇండియా–యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వీలైనంత త్వరగా అమలులోకి రావాలని ఇరు నేతలు బలంగా నొక్కి చెప్పారని జైస్వాల్ వివరించారు. డెన్మార్క్‌తో గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్ర్షిప్ కింద ద్వైపాక్షిక సంబంధాలకు రెండు దేశాలు బలమైన మద్దతు తెలిపాయని, డానిష్ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం భారత్‌లో మరింత విస్తరించగలవని కూడా ఆయన పేర్కొన్నారు.
ఫిన్లాండ్‌లో 33 వేల మంది ఇండియన్లు
ఐస్‌లాండ్ ప్రధాని క్రిస్ట్రన్ ఫ్రోస్టాడాటిర్‌తో జరిగిన భేటీలో క్లీన్ఎనర్జీ, మత్స్య పరిశ్రమ, జియోథర్మల్ ఎనర్జీ, కార్బన్ క్యాప్చర్, ఆర్కిటిక్ సహకారం, డిజిటల్ టెక్నాలజీలపై చర్చలు జరిగాయి. ఇండియా–ఈఎఫ్‌టీఏ టీపీఏ ఒప్పందం వాణిజ్య సంబంధాలను మరింత బలపరుస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐస్‌లాండ్‌లో దాదాపు 600 మంది భారతీయులు నివసిస్తున్నారు.
ఒస్సూర్, వెరికిస్, అల్వోటెక్, మారెల్ వంటి కంపెనీలు భారత్‌లో వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. ఫిన్లాండ్ ప్రధాని పెట్టెరి ఒర్పోతో జరిగిన భేటీలో వ్యాపారం, డిజిటలైజేషన్, ఏఐ, 5జీ,-6జీ, క్వాంటమ్ టెక్నాలజీ, సర్క్యులర్ ఎకానమీపై మాట్లాడారు. 2030 నాటికి ద్వైపాక్షిక వర్తకాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్‌లో వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్‌ను సంయుక్తంగా నిర్వహించాలని కూడా అంగీకరించారు.
నోకియా, కోనే, వార్ట్సిలా, ఫార్టుమ్ వంటి 100కు పైగా ఫిన్నిష్ కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫిన్లాండ్‌లో దాదాపు 33,445 మంది భారతీయ సంతతి వారు ఉన్నారు. దాదాపు 2,400 మంది భారతీయులు అక్కడ ఉన్నత చదువులు చదువుతున్నారు. డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్‌తో జరిగిన సమావేశంలో పునరుత్పాదక ఇంధనం, జలవనరుల నిర్వహణ, గ్రీన్ షిప్పింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫిన్‌టెక్, రక్షణ రంగాలపై చర్చ జరిగింది. డెన్మార్క్ పెన్షన్ ఫండ్స్ భారత్‌లో
మరింత పెట్టుబడులు పెట్టాలని మోదీ ఆహ్వానించారు. ఈ పర్యటన అనంతరం మోదీ ఇటలీ వెళ్లారు.
