పీవీ ఓ యోధుడు.. నిజాంకు వ్యతిరేకంగా పోరాడాడు

పీవీ ఓ యోధుడు.. నిజాంకు వ్యతిరేకంగా పోరాడాడు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా పీఎం మోడీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. దేశాభివృద్ధి కోసం పీవీ చేసిన కృషి అపురూపమని మోడీ గుర్తు చేసుకున్నారు. పీవీ ఓ విజ్ఞాన ఖని అని మెచ్చుకున్న మోడీ.. ఆయన చాలా తెలివైన వారని పేర్కొన్నారు. ఈ మేరకు గత ఏడాది జూన్‌లో నెలవారీ కార్యక్రమం మన్ కీ బాత్‌లో పీవీ గురించి తాను మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో మోడీ షేర్ చేశారు. 

‘మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఓ విజ్ఞాని. దేశ రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞులైన నేతల్లో ఆయన ఒకరు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న సమయంలో ఆయన ప్రధాని పదవిని చేపట్టారు. పీవీ అసామాన్య నాయకుడే కాకుండా అనేక భాషలు నేర్చుకున్న మేధావి కూడా. భారతీయ భాషలతోపాటు విదేశీ భాషల్లో కూడా చక్కగా మాట్లాడగల నైపుణ్యం ఆయన సొంతం. పాశ్చాత్య సాహిత్యం మీద ఆయనకు మంచి పట్టు కూడా ఉండేది. కానీ ఆయన జీవితంలో మరో కోణం కూడా ఉంది. ఆయన ఒక స్వాతంత్ర్య సమరయోధుడు. పీవీ తన యవ్వనంలోనే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకున్నారు. వందేమాతరం గీతాన్ని పాడటానికి హైదరాబాద్ నిజాం నిరాకరించినప్పుడు అందుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పీవీ క్రియాశీలకంగా పాల్గొన్నారు. అప్పుడు ఆయన వయస్సు కేవలం 17 ఏళ్లే. చిన్న వయస్సు నుంచే అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తడంలో ఆయన ముందుండేవారు. ఈ క్రమంలో దేనికీ ఆయన భయపడేవారు కాదు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన పీవీ అత్యంత ఎత్తుకు ఎదగడం, నాయకత్వ లక్షణాలు, నేర్చుకునే గుణాలు అందరికీ స్మరణీయమనే చెప్పాలి. పీవీ శత జయంత్యుత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయన జీవన విశేషాల గురించి సాధ్యమైనంతగా తెలుసుకోవాలి’ అని సదరు వీడియోలో మోడీ విజ్ఞప్తి చేశారు.