కవి నామాల రవీంద్ర సూరికి ‘సినారె పురస్కారం’...ఆగస్టు 2న సురవరం వర్సిటీలో అవార్డు ప్రదానం

కవి నామాల రవీంద్ర సూరికి ‘సినారె పురస్కారం’...ఆగస్టు 2న సురవరం వర్సిటీలో అవార్డు ప్రదానం

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ రచయిత, కవి, సినీ దర్శకుడు నామాల రవీంద్ర సూరిని ప్రతిష్టాత్మక ‘సినారె సాహితీ పురస్కారం’ వరించింది. మహాకవి సినారె 95వ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 2న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ‘మహాకవి సినారె కళా పీఠం’ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది 11 మంది ప్రముఖులను ఈ అవార్డుకు ఎంపిక చేయగా, అందులో రవీంద్ర సూరి ఒకరు.

సాహిత్య, సినీ రంగాల్లో ప్రత్యేక ముద్ర

రవీంద్ర సూరి సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందినవారు. ఉస్మానియా వర్సిటీ నుంచి ఎంఏ (తెలుగు), పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ నుంచి ఎంఫిల్ (జానపద సాహిత్యం) పూర్తి చేశారు. ఉపాధ్యాయ వృత్తిని వదిలి సాహిత్యం, సినీ రంగాల్లో స్థిరపడ్డారు. ఆయన రాసిన అనాహత, రణన్నినాదం నా తెలంగాణ వంటి గ్రంథాలు, వివిధ పత్రికల్లో వచ్చిన కథలు, నవలలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణ రావు సైతం ఆయన రచనలను అభినందించారు. ఒక సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు, నాలుగు సినిమాలకు కథ, మాటలు, పాటలు అందించారు.