- వివరాలు వెల్లడించిన మల్కాజిగిరి సీపీ సుమతి
మల్కాజ్‌గిరి, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వృద్ధ దంపతుల ఇంట్లో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 8 మంది నిందితుల్లో నలుగురిని శనివారం ఉదయం సికింద్రాబాద్‌లోని రేతిఫైల్ బస్ స్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్లు మల్కాజిగిరి సీపీ సుమతి వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ మోహన్స్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీ మోహన్ నర్సిపురం(68) ఇంట్లో ఈ నెల 11న దోపిడీ జరిగింది.
ఇంట్లో వృద్ధ దంపతులు మాత్రమే ఉంటున్నారనే విషయాన్ని గుర్తించిన రాజేశ్, మీనా అనే నేపాల్ కార్మికులు పక్కా ప్లాన్ చేశారు. సునీత అలియాస్ సబీనా, చాంగ్, సామ్రాట్, బిస్వాల్, కమల్, జంకర్ అలియాస్ శంకర్‌తో కలిసి ముఠాగా ఏర్పడి దోపిడీకి పాల్పడ్డారు. ప్లాన్‌లో భాగంగా సబీనాను బాధితుడి ఇంట్లో పని మనిషిగా చేర్పించి, రాజేశ్‌ను ఆమె భర్తగా పరిచయం చేశారు. 11న సర్వెంట్ క్వార్టర్స్‌లో మీనా పుట్టినరోజు పేరిట నాటకం ఆడింది.
ఆ రాత్రి రాజేశ్, సబీనా, మీనా, చాంగ్, సామ్రాట్ ఇంట్లోకి వెళ్లగా, మిగిలిన నిందితులు బయట కాపలా కాశారు. అనంతరం వృద్ధ దంపతులకు బలవంతంగా మత్తు మందు ఇచ్చి స్పృహ తప్పేలా చేశారు. చేతులు, కాళ్లు కట్టేసి గడ్డపారలతో అల్మారాలను పగులగొట్టి 60 తులాల బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి వస్తువులు, రెండు మొబైల్ ఫోన్లు, 3 వేల అమెరికన్ డాలర్లు, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లారు.
ఈ కేసులో నేపాల్‌కు చెందిన సునీత అలియాస్ సబీనా, బిస్వాల్ అలియాస్ విస్వాల్, కమల్ బహదూర్ చలానే, జంకర్ బహదూర్ చలానే అలియాస్ శంకర్ ను అరెస్ట్ చేసి బంగారం, వెండి ఆభరణాలు, నగదు రికవరీ చేసినట్లు సీపీ తెలిపారు.
