- ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
జూబ్లీహిల్స్, వెలుగు: గురుకృప ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించిన చోరీ కేసును బంజారాహిల్స్‌పోలీసులు ఛేదించారు. ఆ కంపెనీలో పనిచేసే వ్యక్తే తన సోదరుడితో కలిసి రూ.కోటి విలువైన బంగారం దొంగతనం చేసినట్లు తేల్చి, నిందితులిద్దరినీ అరెస్ట్‌చేశారు. కర్నాటకలోని బీదర్ జిల్లాకు చెందిన సన్ కాంబ్లే హరీశ్ బంజారా హిల్స్ ఈడెన్ గార్డెన్ లోని గురుకృప ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు.
నగరంలోని ప్రముఖ జ్యువెల్లరీ షోరూంలకు బంగారు, డైమండ్ ఆభరణాల నమూనాలు తీసుకెళ్లడం, ఆర్డర్లు సేకరించడం, చెక్కులు తీసుకురావడం వంటి పనులు చేస్తున్నాడు. దీంతో కంపెనీ లాకర్‌లో భద్రపరిచిన బంగారు ఆభరణాలపై అతనికి పూర్తి అవగాహన ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందులతోపాటు వ్యక్తిగత అవసరాల కోసం ఈజీగా డబ్బు సంపాదించాలని భావించిన హరీశ్.. కంపెనీ లాకర్‌లోని ఆభరణాలను దొంగిలించాలని ప్లాన్వేశాడు.
ఇందుకోసం తన సోదరుడు సన్ కాంబ్లే ఆకాశ్ సహకారం తీసుకున్నాడు. ఈ నెల 17న హరీశ్ఆఫీస్లో విద్యుత్ సరఫరాను నిలిపివేసి, బాత్రూమ్ గ్రిల్‌ను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించాడు. అక్కడ లాకర్‌లో ఉన్న కిలో 28.59 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించి, వాటిని ఆకాశ్‌కు అప్పగించాడు.
ఆ తర్వాత రోజు ఉదయం ఎప్పటిలాగే కార్యాలయానికి వచ్చిన వ్యాపారి ప్రీతేశ్ రమణి చోరీ జరిగినట్లు నిర్ధారించుకొని ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులను బుధవారం మంగళ్‌హాట్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వారు నేరం అంగీకరించడంతో సొత్తు రికవరీ చేశారు. ఇద్దరినీ రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు
