తెలంగాణలో సంచలనం సృష్టించిన పోక్సో బండి భగీరథ్ POCSO కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి భగీరథ్.. మే 16న రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోవడంతో బాధితురాలి వాంగ్మూలం, అలాగే ఆమె తల్లి ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథ్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు.
విచారణలో భగీరథ్ వెల్లడించిన వివరాలను, బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోని అంశాలతో పోలీసులు సరిచూసి నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ కేసు కేవలం భగీరథ్‌తోనే ముగిసిపోలేదు. ఈ అఘాయిత్యం వెనుక ఉన్న మరికొందరి పాత్రపై ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు.
బాధితురాలిపై అఘాయిత్యం జరిగిన సమయంలో నిందితుడు భగీరథ్ స్నేహితులు కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా.. ఘటన జరిగిన తర్వాత ఈ వ్యవహారాన్ని బయటకు రాకుండా అణచివేసేందుకు, రాజీ కుదిర్చేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారని బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సెటిల్‌మెంట్ వ్యవహారంలో భాగస్వామ్యమున్న దాదాపు10 మంది స్నేహితుల పేర్లను ఆమె పోలీసులకు అందజేశారు.
ఈ క్రమంలో కేసులో మరిన్ని కీలక వివరాలను రాబట్టేందుకు భగీరథ్ స్నేహితులను కూడా పోలీసులు విచారించనున్నట్లు సమాచారం. నిందితుడికి సహకరించిన వారు ఎవరు? రాజీ కోసం బెదిరింపులకు పాల్పడింది ఎవరు? అనే కోణంలో పక్కా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు.
