గణేశ్ శోభయాత్రకు పోలీసుల పటిష్ట భద్రత

గణేశ్ శోభయాత్రకు పోలీసుల పటిష్ట భద్రత

గణేశ్ నిమజ్జనం సందర్భంగా నగరంలో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు హైదరాబాద్లో  పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బాలాపూర్ వినాయకుడి శోభయాత్ర ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. బాలాపూర్ నుంచి సౌత్ జోన్ మీదుగా చార్మినార్, MJ మార్కెట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్ బండ్  వరకు యాత్ర సాగుతుందన్నారు. అనంతరం హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం జరుగుతుందన్నారు. గణేశ్ శోభయాత్ర సందర్భంగా మూడు వేల మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటారని చెప్పారు.  

గణేశ్ శోభయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదు. వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ , హుస్సేన్ సాగర్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని సీపీ రంగనాథ్ చెప్పారు. హుస్సేన్ సాగర్ లో దాదాపు 20 వేల వినాయక విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. సెంట్రల్ జోన్ లోనే  ట్రాఫిక్ ఇబ్బందులు  ఎక్కువగా ఉంటాయని అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్ర మధ్యాహ్నం తర్వాత ప్రారంభమవుతుందన్నారు. ట్యాంక్ బండ్ వరకు  ర్యాలీగా బయల్దేరుతాడని చెప్పారు. ఖైరతాబాద్ నుండి ఎన్టీఆర్ మార్గ్  రూట్ లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు. శోభయాత్ర సందర్భంగా వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో  వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నామన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.