భగీరథ్‌‌‌‌, బాధితురాలి స్నేహితుల స్టేట్‌‌‌‌మెంట్లు రికార్డ్

భగీరథ్‌‌‌‌, బాధితురాలి స్నేహితుల స్టేట్‌‌‌‌మెంట్లు రికార్డ్
  • మరో 12 మందిని ప్రశ్నించే అవకాశం
  • నేడు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్న పోలీసులు
  • మల్కాజ్‌‌‌‌గిరి పోక్సో స్పెషల్‌‌‌‌ కోర్టుకు కేసు బదిలీ 
  • ములాఖత్‌‌‌‌లో భగీరథ్‌‌‌‌ను కలిసిన ఆయన తల్లి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బండి భగీరథ్‌‌‌‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలితోపాటు ఆమె తల్లి ఇచ్చిన స్టేట్‌‌‌‌మెంట్ల ఆధారంగా ప్రాసిక్యూషన్‌‌‌‌కు అవసరమైన సమాచారం సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా భగీరథ్‌‌‌‌, బాధితురాలి కామన్ ఫ్రెండ్స్‌‌‌‌గా ఉన్న ఓ స్నేహితురాలుసహా ముగ్గురి స్టేట్‌‌‌‌మెంట్లను సోమవారం రికార్డ్ చేశారు. ప్రధానంగా డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 31న మొయినాబాద్‌‌‌‌ ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో జరిగిన న్యూ ఇయర్‌‌‌‌‌‌‌‌ పార్టీ వివరాలు రాబడుతున్నారు.

ఆ రోజు పార్టీ ఏర్పాటు చేసిందెవరు, భగీరథ్‌‌‌‌తోపాటు ఎవరెవరు వెళ్లారు, భగీరథ్‌‌‌‌ ఎలాంటి లిక్కర్ తీసుకున్నాడనే వివరాలను సేకరించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే బాధితురాలు బ్రీజర్‌‌‌‌ తాగిన తర్వాత ఏం జరిగింది.. ఆమెను ఇంటికి ఎవరు తీసుకెళ్లారు అనే వివరాలతో స్టేట్‌‌‌‌మెంట్లు రికార్డ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో వివాదాన్ని సెటిల్‌‌‌‌ చేసేందుకు యత్నించిన పలువురిని ప్రశ్నించేందుకు పేట్‌‌‌‌ బషీరాబాద్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి దాదాపు 12 మందిని విచారించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా, మొదటి ములాఖత్‌‌‌‌లో భాగంగా భగీరథ్‌‌‌‌ తల్లి సోమవారం చర్లపల్లి జైలుకు వెళ్లారు. భగీరథ్‌‌‌‌ను కలిసి ఆరోగ్యం, భోజన వసతుల గురించి ఆరా తీసినట్లు తెలిసింది.

బెయిల్‌‌‌‌ దొరుకుడు డౌటే.. కేసును మల్కాజ్‌‌‌‌గిరి ఫాస్ట్రాక్‌‌‌‌ కోర్టుకు బదిలీ 

పోక్సో కేసు కావడంతో విచారణను మల్కాజ్‌‌‌‌గిరిలోని పోక్సో స్పెషల్ కోర్టుకు బదిలీ చేశారు. బాధితురాలి తల్లి స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌తో పాటు బాధితురాలి వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లో పలు సెక్షన్లను జోడించారు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు బీఎన్ఎస్ సెక్షన్ 64(2)(ఎం) చేర్చారు. దీంతో పాటు 74,75 బీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌, మైనర్ కావడంతో పోక్సో 5(1) రెడ్‌‌‌‌ విత్‌‌‌‌ 6 చట్టం కింద రిమాండ్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ ఫైల్‌‌‌‌ చేశారు.

దీంతో నిందితుడికి బెయిల్‌‌‌‌ లభించే అవకాశాలు లేవని తెలిసింది. మరోవైపు, ప్రాసిక్యూషన్‌‌‌‌ ఆధారాల కోసం భగీరథ్‌‌‌‌ను వారం రోజుల పాటు కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిందితుడిని కస్టడీకి తీసుకున్న అనంతరం మొయినాబాద్ ఫామ్‌‌‌‌హౌజ్‌‌‌‌, నానక్‌‌‌‌రామ్‌‌‌‌గూడలోని అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌తోపాటు సుచిత్రలోని బాధితురాలి ఇంటి వద్ద వివరాలు సేకరించనున్నట్లు తెలిసింది.