ఓయూ ప్రొఫెసర్ ఇంట్లో పోలీసుల సోదాలు.. అరెస్ట్

ఓయూ ప్రొఫెసర్ ఇంట్లో పోలీసుల సోదాలు.. అరెస్ట్

ఓయూ ప్రొఫెసర్, విరసం నూతన కార్యదర్శి డా. కాశీం ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.  మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆయనపై 2016లో కేసు నమోదైంది. అందులో భాగంగానే గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన కేసులో ప్రొఫెసర్ కాశీం ఏ-2గా ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి సెర్చ్ వారెంట్‌తో ప్రొఫెసర్ కాశీం ఇంట్లో సోదాలు నిర్వహించారు. ప్రొఫెసర్ కాశీం నివాసంలో దాదాపు 5 గంటలు ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హర్డ్ డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రొఫెసర్ కాశీంను గజ్వేల్‌ పీఎస్‌కు తరలిస్తున్నారు. కాశీం ఇంట్లో పోలీసుల సోదాలపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు.

ప్రొఫెసర్ కాశీం అరెస్ట్‌పై ఆయన భార్య స్నేహాలత స్పందించారు. ‘ నా భర్తను అరెస్ట్ చేయడాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. ఎప్పుడో జరిగిన కేసు గురించి ఈరోజు గజ్వేల్ పోలీసులు సోదాలు చేశారు. 2016లో అక్రమంగా బనాయించిన కేసులో ఈరోజు నా భర్తను అరెస్ట్ చేశారు. 2016లో హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వెళ్తున్న శ్యామ్ సుందర్ అనే వ్యక్తి దగ్గర దొరికిన పుస్తకాలపై కేసు నమోదు చేశారు. నేను తెలంగాణ వాడినే అనే పుస్తకంతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై రాసిన పుస్తకాలపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. గడ్డపారతో తలుపులు పగలగొట్టి అక్రమంగా లోపలికి వచ్చారు. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును సెర్చ్ చేశారు.  కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను, ఇంట్లో ఉన్న పుస్తకాలను తీసుకెళ్లారు. నా భర్త అక్రమ అరెస్ట్‌పై నేను హైకోర్టును ఆశ్రయిస్తాను’ అని ఆమె తెలిపారు.

For More News..

గిన్నిస్ బుక్‌లోకెక్కిన ప్రపంచపు పొట్టి వ్యక్తి ఇకలేరు

రాజశేఖర్ ఆవేశపరుడు: హీరో సుమన్

దాడి వీడియో: రేప్ బాధితురాలి కుటుంబంపై దాడి.. తల్లి మృతి