తెలంగాణలో మూడు రాజ్యసభ సీట్లకు ఫిబ్రవరి 27న పోలింగ్

తెలంగాణలో మూడు రాజ్యసభ సీట్లకు ఫిబ్రవరి 27న పోలింగ్
  • దేశవ్యాప్తంగా 56 స్థానాలకు ఎన్నికలు
  • షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీఐ.. వచ్చే నెల 8న నోటిఫికేషన్
  • 15 వరకు నామినేషన్లు
  •  రాష్ట్రంలో కాంగ్రెస్​కు రెండు, బీఆర్ఎస్​కు ఒక సీటు దక్కే చాన్స్

హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనుంది. తెలంగాణ నుంచి మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. 

ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీఐ సిద్ధమైంది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 15వ తేదీ దాకా నామినేషన్లు స్వీకరిస్తారు. 16న పరిశీలన, 20వ తేదీ దాకా నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ ఆవరణలో పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 29వ తేదీతో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎమ్మెల్యేలు ప్రాధాన్యతా క్రమంలో ఓటేసి రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చే వాయిలెట్ కలర్ స్కెచ్ తోనే ఓటు వేయాల్సి ఉంటుంది. వేరే పెన్ను, స్కెచ్ ఉపయోగించొద్దని షెడ్యూల్​లో ఈసీఐ స్పష్టం చేసింది. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ బలాబలాలు

అసెంబ్లీలో సభ్యుల సంఖ్యాబలం రీత్యా కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు, బీఆర్ఎస్​కు ఒక స్థానం దక్కే చాన్స్ ఉంది. అసెంబ్లీలో 119 స్థానాలుండగా ఇందులో కాంగ్రెస్​పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిత్రపక్షం సీపీఐకి ఒక సభ్యుడున్నారు. బీఆర్ఎస్​కు 39 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీ నుంచి ఎనిమిది మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు సభ్యులు గెలిచారు. ఒక్కో రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే కనీసం 39 మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి. ఒక పార్టీ తరఫున ఒక అభ్యర్థిని పోటీకి దించాలంటే కనీసం 10 మంది ఎమ్మెల్యేలు ఆయన్ను ప్రతిపాదిస్తూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన నామినేషన్​వేసే చాన్స్ కాంగ్రెస్, బీఆర్ఎస్​కు మాత్రమే ఉంది. సభలో పార్టీల సంఖ్యాబలాన్ని చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్​కు ఒక్కో సీటు దక్కనున్నాయి. మూడు స్థానాలు ఖాళీగా ఉండగా అంతకన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఎన్నిక అనివార్యమవుతుంది. బీఆర్ఎస్​కు ఉన్న 39 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ అభ్యర్థికే ఓటేస్తే ఆ సీటు గెలుస్తారు. మిత్రపక్షంతో కాంగ్రెస్​కు ఉన్న 65 మంది సభ్యులను ఇద్దరు అభ్యర్థులకు కేటాయిస్తే ఒకరికి 33, రెండో అభ్యర్థికి 32 ఓట్లు వస్తాయి. ఈ లెక్కన వరుసగా అత్యధిక ఓట్లు దక్కించుకున్న ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించినట్టు ప్రకటిస్తారు. 

ప్రాధాన్యతా క్రమంలో ఓటింగ్

రాజ్యసభ ఎన్నికల్లో ఎంత మంది పోటీలో ఉన్నా అందరికీ ఓటర్లుగా ఉన్న ఎమ్మెల్యేలు ప్రాధాన్యతా క్రమంలో ఓటేసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ముగ్గురిని, బీఆర్ఎస్ ఒకరిని పోటీకి దించితే ఇతర పార్టీల ఓట్లు కీలకమవుతాయి. అలాగే, ఒక అభ్యర్థికి మొదటి ప్రయారిటీ ఓటు వేసిన ఓటరు, పోటీలో ఉన్న మిగతా అభ్యర్థులకు రెండు, మూడు, నాలుగు ప్రాధాన్యత క్రమాల్లో ఓటు వేయవచ్చు. అప్పుడు అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్​చేసి ఆయనకు వచ్చిన ఓట్లను ఆ తర్వాతి హయ్యెస్ట్ సాధించిన అభ్యర్థికి కలుపుతారు. ఇలా మ్యాజిక్​ఫిగర్​39 లేదా అంతకన్నా తక్కువ హయ్యెస్ట్ నంబర్ వచ్చే వరకు పోటీలో ఉన్న అభ్యర్థులను ఎలిమినేట్ చేసి విజేతలను ప్రకటిస్తారు.

దేశవ్యాప్తంగా ఇవీ ఖాళీలు

ఏపీ నుంచి మూడు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ నుంచి 10 స్థానాల్లో అభ్యర్థులు రిటైర్ కానున్నారు. బీహార్, మహారాష్ట్రాల్లో 6 చొప్పున, వెస్ట్ బెంగాల్ లో 5, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో 4 చొప్పున, ఒడిశా, రాజస్థాన్ నుంచి 3 చొప్పున, హర్యానా, చత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్​కు చెందిన ఒక్కో స్థానం ఖాళీ కానుంది.