అధికారాలు, పరిధి తగ్గించారు: హన్స్​రాజ్

అధికారాలు, పరిధి తగ్గించారు: హన్స్​రాజ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో బీసీ కమిషన్  నామ్కేవాస్తేగా తయారైందని, కమిషన్ కు ఉన్న అధికారాలు, పరిధి తగ్గించారని నేషనల్ ఓబీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారాం మండిపడ్డారు. బెంగాల్ సహా బీజేపీయేతర రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్లు సరిగ్గా అమలు కావడం లేదని ఆయన అన్నారు. బెంగాల్​లో  మెడికల్ సీట్ల రిజర్వేషన్లు కూడా అమలు చేయడం లేదని తెలిపారు. ఆదివారం బీజేపీ స్టేట్​ ఆఫీసులో ఓబీసీ నేతల సమావేశం జరిగింది. హన్స్​రాజ్ గంగారాం, బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హన్స్​రాజ్ ను సంజయ్ సన్మానించారు. అనంతరం హన్స్​రాజ్​ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓబీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని, తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు. మోడీ హయాంలోనే ఓబీసీలకు న్యాయం జరుగుతున్నదని, కేంద్రంలోని మోడీ కేబినెట్​లో  27 మంది ఓబీసీలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ ఓబీసీ అని, ఆయన పోరాట యోధుడని, నిత్యం జనాల్లో ఉండే వ్యక్తి అని హన్స్​రాజ్ కొనియాడారు. సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. 

కేసీఆర్​ పాలనలో పేదలకు అన్యాయం: బండి సంజయ్​

‘‘పేదల పార్టీ బీజేపీ అయితే పెద్దల పార్టీ బీఆర్ఎస్. బీఆర్ఎస్ కు చెందిన జగిత్యాల మున్సిపల్ చైర్​ పర్సన్ శ్రావణి కేసీఆర్ పాలనలో పేదలు, బలహీనవర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో చెప్పడమే ఇందుకు నిదర్శనం” అని బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్​ పాలనపై విసిగిపోయారని, బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. పేదల బలిదానంతో తెలంగాణ వచ్చిందని, కానీ గత 9 ఏండ్ల నుంచి పెద్దలే రాజ్యమేలుతున్నారని, పేదలకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయం మొదలైందని,  సీఎం కేసీఆర్ మళ్లీ కుల సంఘాలను పిలిచి డబ్బులు పంచుతారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘‘కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల పేరుతో వందల కోట్ల రూపాయలు ఇస్తానని కేసీఆర్​ చెప్పి మోసం చేస్తడు. ఓబీసీ సామాజికవర్గ ప్రజలకు ఓబీసీ మోర్చా అండగా ఉండాలి. అన్ని కుల సంఘాలకు దిక్సూచి కావాలి.  ప్రతి సామాజికవర్గాన్ని కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలి. వారికి భరోసా ఇవ్వాలి” అని తెలిపారు. ‘‘కష్టపడే కార్యకర్తలను జాతీయ నాయకత్వం గుర్తిస్తుందనే దానికి హన్స్​రాజ్ గంగారాం నిదర్శనం. నిత్యం పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఓబీసీ మోర్చా నేతలు సమాజం కోసం, పార్టీ బలోపేతం కోసం పనిచేయాలి” అని బండి సంజయ్​ అన్నారు. 

త్వరలోనే జాతీయ ఓబీసీ జాబితాలోకి లింగాయత్​లు

రాష్ట్రంలో చాలా రోజులుగా డిమాండ్ లో ఉన్న లింగాయత్ తో పాటు మరికొన్ని కులాలను త్వరలోనే జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని నేషనల్  ఓబీసీ కమిషన్ చైర్మన్ హన్స్​రాజ్ గంగారాం తెలిపారు. ఆదివారం బీజేపీ స్టేట్​ ఆఫీసులో ఆయనను వీరశైవ లింగాయత్ సామాజికవర్గానికి చెందిన నేతలు బండి సంజయ్ కుమార్ సమక్షంలో కలిశారు. ఈ సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప, వీరశైవ లింగాయత్ పెద్దలు అశోక్ ముస్తాపురే, సంకటాల సోమేశ్వర్, మల్లికార్జున్, చంద్రశేఖర్  పాల్గొన్నారు.