దేశ వ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఉప ఎన్నిక జరిగింది. బీహార్ రాష్ట్రంలో బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం దేశ వ్యాప్తంగా అందర్నీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే.. ఈ నియోజకవర్గం నుంచి జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ స్వయంగా బరిలోకి దిగారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గం బీజేపీ కంచుకోట. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ సొంత నియోజకవర్గం కావటంతోపాటు.. జెన్ జీ ఉద్యమం తర్వాత బీహార్ రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి ఉప ఎన్నిక.
ఎన్నికల ఫలితాల్లో బంకిపూర్ నియోజకవర్గంలో జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత 3 వేల 451 ఓట్ల లీడ్ లో ఉన్నారు పీకే. ప్రత్యర్థిగా గట్టిపోటీ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ వెనకబడి ఉన్నారు. ఆరు రౌండ్ల తర్వాత ప్రశాంత్ కిషోర్ కు 11 వేల 603 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ కు 8 వేల 152 ఓట్లు వచ్చాయి.
ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. ప్రతి రౌండ్ లో ప్రశాంత్ కిషోర్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తం 31 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంది. ఇప్పటి వరకు అయ్యింది కేవలం ఆరు రౌండ్లు మాత్రమే. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ గెలుస్తారా లేదా.. మిగతా రౌండ్లలో ఈ స్థాయిలో ఓట్లు సాధిస్తారా లేదా అనే ఉత్కంఠ రేపుతోంది. ఈ నియోజకవర్గంలో గతంలో బీజేపీకి ప్రత్యర్థి ఆర్జేడీ ఉండేది. ఇప్పుడు జన్ సూరజ్ పార్టీ ఆ స్థానంలోకి వచ్చింది.
