2026 సంవత్సరానికి గాను పద్మా అవార్డులను మే 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న తొలి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేస్తారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. 2026వ సంవత్సరానికి గాను మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించింది భారత ప్రభుత్వం. వీటిలో 5 పద్మ విభూషణ్-, 13పద్మభూషణ్ , 113 పద్మశ్రీ పురస్కారాలున్నాయి. పురస్కారం అందుకునేవారిలో 13 మంది మహిళలు, 16 మందికి మరణానంతరం ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.
పద్మ విభూషణ్, పద్మ భూషణ్ ,పద్మశ్రీ అనే పద్మ పురస్కారాలు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. 1954లో స్థాపించబడిన ఈ పురస్కారాలను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. ఈ పురస్కారం విశిష్టమైన కృషిని గుర్తించి, కళ, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సాంఘిక సేవ, సైన్స్ ,ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు ,వాణిజ్యం ,పరిశ్రమలతో సహా వివిధ రంగాలు ,విభాగాలలో విశిష్టమైన ,అసాధారణమైన విజయాలు సాధించిన వారికి ప్రదానం చేస్తారు.
