ప్రపంచానికి ఆధ్యాత్మికతను మనమే అందించాం

ప్రపంచానికి ఆధ్యాత్మికతను  మనమే అందించాం

    రామచంద్ర మిషన్‌‌ గ్లోబల్‌‌ హెడ్‌‌ క్వార్టర్స్‌‌  ప్రారంభించిన  రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్‌‌

ఆధ్యాత్మికత అనేది గొప్ప వరమని, దానిని ప్రపంచానికి అందించిందే ఇండియా అని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ అన్నారు. కన్హ శాంతివనం పవిత్రమైన స్థలమని, శాంతివనంలో దాజీ సేవలు ఎంతో ఉన్నతమైనవని కొనియాడారు. ఆదివారం రంగారెడ్డి జిల్లాలోని కన్హ శాంతివనాన్ని రాష్ట్రపతి సందర్శించారు. శాంతివనంలో ఏర్పాటు చేసిన రామచంద్ర మిషన్‌‌ గ్లోబల్‌‌ హెడ్‌‌ క్వార్టర్స్‌‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. వేదాంత, తీర్థాంకర్‌‌ మహావీర్‌‌, గౌతమబుద్ధ, గురునానక్‌‌, కబీర్‌‌ బోధనలను ఆధునిక ప్రపంచానికి స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ మరికొందరు అందించారని, సత్యం, దయ, అహింసను చాటిచెప్పి విశ్వమానవాళి గౌరవాన్ని పొందారని అన్నారు. రామచంద్ర మిషన్‌‌ వ్యక్తిగత, సామాజిక మార్పుల కోసం కృషి చేస్తుందన్నారు.

మిషన్​తో రెండు దశాబ్దాల అనుబంధం

రామచంద్ర మిషన్‌‌ 75వ వార్షికోతవ్సంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని కోవింద్​ చెప్పారు. ప్రపంచంలోని 150 దేశాల్లో మిషన్‌‌ సేవలందిస్తోందన్నారు. 1965లో 40 మందితో ప్రారంభమైన ధ్యానకేంద్రంలో ఈరోజు లక్షలాది మంది అభ్యాసకులు ఉన్నారని చెప్పారు. మహిళలు, రైతులు, చేతివృత్తి పనిచేసే వారు, చిన్న వ్యాపారులుకు లబ్ధి చేకూర్చేలా సంస్థ కార్యక్రమాలు ఉన్నాయని, ప్రకృతిని, జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. తనకు రామచంద్ర మిషన్‌‌తో రెండు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. 2002లో యూఎన్‌‌ జనరల్‌‌ అసెంబ్లీలో ప్రసంగించడానికి తాను వెళ్లినప్పుడు అక్కడి ఆశ్రమ నిర్వాహకుడు కమలేష్​ పటేల్‌‌ను కలిశానని, అక్కడ తనకు లభించిన ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేనన్నారు.

శాంతిమార్గంలో అందరూ నడవాలి

1957లో బాబుజీ మహరాజ్‌‌ యూఎన్‌‌కు రాసిన లేఖలో దాజీ రాసిన ‘‘డిజైనింగ్‌‌ డెస్టినీ: ద హార్ట్‌‌ఫుల్‌‌నెస్‌‌ వే’’పుస్తకాన్ని ప్రస్తావించారని రాష్ట్రపతి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు, అనిశ్చితి, అభద్రత, శత్రుభయం పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో రామచంద్ర మిషన్‌‌ సూచిస్తోన్న శాంతిమార్గం అందరు అనుసరించాలని చెప్పారు. ‘డిజైనింగ్‌‌ డెస్టినీ’లో దాజీ సూచించిన ఐదు నియమాల్లో మొదటిదైన మానవత్వాన్ని అనుసరించడం మనతోనే మొదలు పెట్టాలని సూచించారు. మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడానికి యువత ముందుకురావాలని పిలుపునిచ్చారు. శాంతివనంలో రాష్ట్రపతి, గవర్నర్‌‌ మొక్కలు నాటారు. రాష్ట్రపతి కోవింద్ దంపతులు సుమారు 2 గంటలపాటు శాంతివనంలో గడిపారు. ఒకేసారి లక్షమంది ధ్యానం చేసుకునేలా నిర్మించిన కన్హ శాంతివనాన్ని గ్లోబల్​ హెడ్​క్వార్టర్​గా రాష్ట్రపతి అభివర్ణించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్‌‌, గవర్నర్లు తమిళిసై, దత్తాత్రేయను రామచంద్ర మిషన్ చైర్మన్ దాజీ కమలేష్ పటేల్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్‌‌, బండారు దత్తాత్రేయ, మంత్రులు మహమూద్‌‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌‌గౌడ్‌‌ పాల్గొన్నారు.

రాష్ట్రపతికి వీడ్కోలు

రెండు రోజుల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి కోవింద్‌‌ ఢిల్లీకి తిరిగి వెళ్లారు. బేగంపేట ఎయిర్‌‌పోర్టులో గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్‌‌, బండారు దత్తాత్రేయ, సీఎం కేసీఆర్‌‌, మండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌రెడ్డి, స్పీకర్‌‌ పోచారం శ్రీనివాస్‌‌రెడ్డి, మంత్రులు మహమూద్‌‌ అలీ, ప్రశాంత్‌‌రెడ్డి, మల్లారెడ్డి, ప్లానింగ్‌‌ బోర్డు వైస్‌‌ చైర్మన్‌‌ బి.వినోద్‌‌కుమార్‌‌, గ్రేటర్‌‌ మేయర్‌‌ బొంతు రామ్మోహన్‌‌, సీఎస్‌‌ సోమేశ్‌‌కుమార్‌‌ ఆయనకు వీడ్కోలు పలికారు.