గాంధీజీ చెప్పిన్రు, మేం చేసినం

గాంధీజీ చెప్పిన్రు, మేం చేసినం

    చర్చలు, డిబేట్లే ప్రజాస్వామ్యానికి బలం

    నిరసనలలో హింసకు చోటివ్వద్దు

    సిటిజన్​ షిప్​ ప్రొసీజర్​ను మార్చలే

     పార్లమెంట్​లో ప్రెసిడెంట్​ కోవింద్

న్యూఢిల్లీ: సిటిజన్​ షిప్​ సవరణ చట్టం(సీఏఏ) మహాత్ముడి ఆశయాలను నెరవేర్చేలా ఉందని ప్రెసిడెంట్​ రామ్​నాథ్​ కోవింద్​ అన్నారు. దేశవిభజన తర్వాత పాకిస్తాన్​లోని సిక్కులు, హిందువులు అక్కడ ఉండలేమని అనుకుంటే నిరభ్యంతరంగా ఇండియాకు రావొచ్చని మహాత్మా గాంధీ చెప్పారని ఆయన గుర్తుచేశారు. జాతిపిత ఆశయానికి కార్యరూపమే సీఏఏ అని కొనియాడారు. ఈమేరకు శుక్రవారం పార్లమెంట్​లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రెసిడెంట్​ మాట్లాడారు. చర్చలు, డిబేట్ల ద్వారా ప్రజాస్వామ్యం బలపడుతుందని, నిరసనల పేరుతో హింసకు పాల్పడితే బలహీన పడుతుందని ఆయన హెచ్చరించారు. దేశంలో అందరికీ సమాన గౌరవం దక్కాలనేది మన దేశం పాటిస్తున్న సంప్రదాయమని అన్నారు. అయితే, దేశ విభజన టైంలోనే ఈ నమ్మకానికి తీవ్రంగా దెబ్బ తగిలిందన్నారు. పాక్​లో ఉండలేక ఇండియాకు వచ్చిన హిందువులు, సిక్కులు సాధారణ జీవితం గడిపేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మహాత్మా గాంధీ చెప్పారని ప్రెసిడెంట్​ గుర్తుచేశారు. సీఏఏకు ఆమోదం తెలపడం ద్వారా పార్లమెంట్​ సభ్యులు గాంధీజీ స్ఫూర్తిని ఆచరణలోకి తేవడం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇండియన్​ సిటిజన్​షిప్​ను ఆశించే వారికి సంబంధించిన రూల్స్​లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదని కోవింద్​ చెప్పారు. సిటిజన్​ షిప్​ పొందడానికి ఇప్పటి వరకు ఉన్న ప్రొసీజర్​లో ఏ మార్పూ లేదని, ఇకపైనా ఆ రూల్స్​ అలాగే ఉంటుందని అన్నారు. ఆ ప్రొసీజర్​ను ఫాలో కావడం ద్వారా ప్రపంచంలోని ఏ దేశ పౌరుడైనా ఇండియన్​ సిటిజన్​గా మారొచ్చని కోవింద్​ వివరణ ఇచ్చారు.

బ్లాక్​ ఆర్మ్​ బ్యాండ్లు కట్టుకున్న ప్రతిపక్ష నేతలు

పార్లమెంట్​ రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామనాథ్​ కోవింద్​ చేసిన  ప్రసంగంపై  ప్రతిపక్షాలు శుక్రవారం నిరసన తెలిపాయి. సీఏఏ, ఎన్​పీఆర్​, ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్​తోపాటు 14 ప్రతిపక్షాలు బ్లాక్​ఆర్మ్​ బ్యాండ్లు కట్టుకుని నిరసన తెలిపాయి.  ప్రెసిడెంట్​ ప్రసంగిస్తున్నప్పుడు సెంట్రల్​ హాల్​లో ప్రతిపక్ష నేతలంతా ఒకే  బ్లాక్​లో కూచుకున్నారు.  సీఏఏను కోవింద్​ పొగుడుతున్నప్పుడు కొంతమంది  ప్రతిపక్ష సభ్యులు..“షేమ్, షేమ్​”అంటూ నినాదాలు చేశారు. బ్యానర్లు ప్రదర్శించారు.

నిరసనలో పాల్గొన్న పార్టీలు

కాంగ్రెస్​, ఎన్సీపీ, ఎస్పీ, డీఎంకే, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, శివసేన, జేఎంఎం, జేడీఎస్​, ఆర్​ఎస్పీ, కేరళ కాంగ్రెస్​(ఎం), ఐయూఎంఎల్​, నేషనల్​కాన్ఫరెన్స్​.

సోనియా ఆధ్వర్యంలో నిరసన

రాజ్యాంగాన్ని రక్షించాలంటూ పార్లమెంట్​ కాంప్లెక్స్​ గాంధీ విగ్రహం దగ్గర అంతకుముందు కాంగ్రెస్​ చీఫ్​ సోనియా గాంధీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. రాహుల్​గాంధీ, గులాంనబీ ఆజాద్​, మోతీలాల్​ ఓరా, అధిర్​ రంజన్​ చౌధురి, ఏకే ఆంటోనితోపాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన లోక్​సభ, రాజ్యసభ ఎంపీలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. “సేవ్​ కాన్​స్టిట్యూషన్​” స్లోగన్లు రాసున్న  ప్లకార్డుల్ని పట్టుకున్నారు.

ఇంకా ఏమన్నారంటే..

మందులు, స్టెంట్లు, ఇంప్లాంట్ల ధరలు తగ్గించడం వల్ల లక్షలాది రోగులకు ప్రభుత్వం ఊరట కలిగించింది.

ఈ ఏడాది కొత్తగా అనుమతించిన 75 మెడికల్​ కాలేజీల ద్వారా 16 వేల ఎంబీబీఎస్​ సీట్లు, 4 వేల పీజీ సీట్లు పెరుగుతాయి.

మైనారిటీ కమ్యూనిటీకి చెందిన 2,65,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

దేశ రక్షణకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేందుకు సైనిక బలగాలను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నాం.

కాశ్మీర్​లో టెర్రర్​ యాక్టివిటీస్​ తగ్గాయి.