స్వచ్ఛభారత్‌తో మహాత్ముడికి అసలైన నివాళి అర్పించాం : రాష్ట్రపతి

స్వచ్ఛభారత్‌తో మహాత్ముడికి అసలైన నివాళి అర్పించాం : రాష్ట్రపతి

మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భం మన దేశానికి చాలా కీలకం అని చెప్పారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రత్యేక సందేశం ఇచ్చారు. సత్యం, అహింస, సంక్షేమం కోరుతూ.. మానవాళికి మహాత్మగాంధీ ఇచ్చిన సందేశం చాలా గొప్పదన్నారు రాష్ట్రపతి.

“మహాత్మగాంధీ అనే పేరు భారత్ లోనే కాదు.. సముద్రాలు దాటి ఖండాంతరాల్లో వ్యాపించింది. గాంధీ జయంతిని ప్రపంచ అహింసా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. గాంధీజీ విలువలు, ఆయన పాటించిన విధానాలు మన దేశానికే కాదు.. ప్రపంచం మొత్తం పాటిస్తోంది. పరమత సహనం, ఐక్యత, అంటరానితనం రూపుమాపడం, మహిళాభ్యున్నతి, విద్య, శుభ్రత, పర్యావరణ పరిరక్షణ, జలవనరుల సంరక్షణ లాంటి అనేక అంశాల్లో ఆయన చూపిన దారిలోనే నడిచాం. మహాత్ముడి వారసత్వాన్ని మరింతగా ముందుకు తీసుకుపోదాం” అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.

“స్వచ్ఛభారత్ మిషన్ ను తీసుకుని.. 150వ జయంతి సందర్బంగా మహాత్ముడికి భారత దేశ ప్రజలు అత్యంత కచ్చితమైన నివాళి అర్పించారు. మహాత్ముడు కోరుకున్న భారతావని నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా కదలాలి” అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన ప్రత్యేక సందేశంలో ప్రజలను కోరారు.