అఖిలేశ్​ కామెంట్లకు యోగి కౌంటర్

అఖిలేశ్​ కామెంట్లకు యోగి కౌంటర్

లక్నో: ‘అధికారంలో ఉన్నప్పుడు మథుర, బృందావనం సహా చాలా ప్రాంతాలను డెవలప్​​ చేయలేదు.. మీరు చేయలేని పనిని బీజేపీ చేసిచూపెట్టింది. కనీసం మీ ఫెయిల్యూర్స్​ను గుర్తుతెచ్చుకుని ఏడవండి’ అంటూకొందరిని కృష్ణుడు కోప్పడుతూ ఉండొచ్చని యోగి ఆదిత్యనాథ్​ అన్నారు. ‘కృష్ణుడు నాకు ప్రతిరోజూ కలలోకి వస్తున్నడు’ అంటూ అఖిలేశ్​ యాదవ్​ చేసిన కామెంట్​ను యోగి తిప్పికొట్టారు. మంగళవారం అలీగఢ్​లో జరిగిన ఓ కార్యక్రమంలో యోగి మాట్లాడారు. ‘కొంతమందికి రోజూ కలలో కృష్ణుడు కనిపిస్తున్నడు కావొచ్చు.. ఎందుకంటే వాళ్ల హయాంలో మథుర లాంటి పుణ్యక్షేత్రాలు ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలె. అధికారం చేతిలో ఉన్నా ఆయా క్షేత్రాలపై నిర్లక్ష్యం చూపినందుకు వారిని కోప్పడుతుండొచ్చు’ అని యోగి చెప్పారు. అంతకుముందు.. సోమవారం యూపీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అఖిలేశ్​ యాదవ్ మాట్లాడారు. కృష్ణుడు రోజూ తన కలలోకి వస్తున్నడని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి, రాష్ట్రంలో ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని కృష్ణుడు చెప్పాడన్నారు. రామరాజ్యానికి సోషలిజమే(సమాజ్ వాద్) మార్గమని, సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పడుతుందని అన్నాడని అఖిలేశ్​ వివరించారు.

కృష్ణుడి చుట్టూ రాజకీయాలు.. 
ప్రస్తుతం యూపీ రాజకీయాలన్నీ కృష్ణుడి చుట్టూ తిరుతున్నాయి. బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ కామెంట్లతో ఇది మొదలైంది. ‘‘మథుర నుంచి యోగి ఆదిత్యనాథ్ పోటీ చేయాలని ఎవరో నన్ను ఆదేశిస్తున్నట్లు కలగన్నాను. అది కృష్ణుడి ఆదేశమేనని నమ్ముతున్నా” అని చెప్పారు. దీంతో ఒకరి తర్వాత ఒకరు కృష్ణుడి పేరు మీద కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో అయోధ్య లేదా మథుర నుంచి యోగి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.