పొగ తాగడం మానేయాలంటే...

పొగ తాగడం  మానేయాలంటే...

పొగ తాగితే క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు. అయినా... స్టైల్​, ఫ్యాషన్, రిలాక్సేషన్, సరదా కోసం అంటూ స్మోకింగ్ అలవాటు చేసుకుంటారు చాలామంది. వాళ్లు తాగే సిగరెట్​ పెట్టె మీదే రాసి ఉన్నా, సినిమా హాల్స్​లో సినిమా కంటే ముందే ‘పొగ తాగడం హానికరం.. అని అడ్వర్టైజ్​మెంట్​ వేసినా వాటిని పట్టించుకోరు. అందుకే ప్రత్యేకించి దీనిపై గట్టిగా అవగాహన తీసుకురావాలని ‘నో టొబాకో డే’ని కనిపెట్టారు. అందులో భాగంగా ప్రతి ఏటా మే 31న అవేర్​నెస్ ప్రోగ్రామ్​లు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా స్మోకింగ్​ ఎలా మానాలి? లేదా ఎలా మాన్పించాలి? అసలు ఇది ఎన్నిరకాలుగా నష్టం చేస్తుంది? స్మోకింగ్​ బదులు ఏం చేస్తే బెటర్? వంటి ప్రశ్నలకు జవాబులు ఇరవయ్యేండ్ల అనుభవమున్న డాక్టర్​. పాలంకి సత్య దత్తాత్రేయ మాటల్లో...

చుట్ట, బీడీ, సిగరెట్... ఎందులోనైనా పొగాకు ఉంటుంది. అందులో ఉండే నికొటిక్​ అనే పదార్థం వల్ల పొగతాగిన మరుక్షణానికే మత్తులోకి తీసుకెళ్తుంది. ఒత్తిడి పోయి, మైండ్ రిలాక్స్ అవుతుంది. దీనికి అలవాటు పడి, పదే పదే పొగతాగుతుంటారు. కొన్నాళ్లకు అది వ్యసనంగా మారుతుంది. అప్పుడు దానివల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో నష్టాలు జరుగుతాయి. అయినా, వాటిని మాత్రం పెడచెవిన పెట్టేస్తుంటారు. కానీ, వాటి గురించి సరైన అవగాహన లేకపోతే పొగతాగేవాళ్లకే కాదు.. వాళ్ల చుట్టూ ఉండేవాళ్లకు కూడా ప్రమాదమే! 

ఎందుకు స్మోక్ చేస్తారంటే..

ప్రజలు పొగాకుని లేదా స్మోకింగ్​ ఎందుకు చేస్తారనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. ఒత్తిడి తగ్గడానికి, ప్రశాంతత కోరుకున్నప్పుడు, స్నేహితులను కలిసినప్పుడు స్మోక్ చేస్తుంటారు. అయితే, వాళ్లలో చాలామంది స్మోక్ చేయడం వల్ల పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్​ బారిన పడుతున్నారు. నెగెటివ్ మూడ్​లో ఉండడం, రోజూ ఒత్తిడికి గురవడం దాని లక్షణాలు. 

స్మోకర్స్ కాఫ్​ అంటే..

స్మోకింగ్ చేసేవాళ్లకు దగ్గు వస్తుంటుంది. దాన్ని స్మోక్​ కాఫ్​ అంటారు. స్మోక్ చేసేటప్పుడు పొగతో పాటు రకరకాల క్వాంటిటీల్లో టాక్సిన్స్​ను కూడా పీలుస్తారు. వాటిలో ఉండే రసాయనాలను పీల్చడం వల్ల మంట వస్తుంది. లంగ్స్​లో ఉన్న సిలియా డ్యామేజ్ అవుతుంది. ఊపిరితిత్తుల్లోని చిన్న కణాల్లాంటి వెంట్రుకలు (సిలియా) గాలి ద్వారా శ్లేష్మం (మ్యూకస్), చెత్త (డెబ్రిస్)​ను పట్టుకుని క్లియర్ చేస్తుంది.కానీ, స్మోక్ చేయడం వల్ల సిలియా చచ్చుబడిపోతుంది. దాంతో టాక్సిన్స్​ వెళ్లి లంగ్స్​లో చేరతాయి. దాంతో మ్యూకస్ పెరుగుతుంది. శరీరం మ్యూకస్​ని ఇష్టపడదు.. అందువల్ల దగ్గు మొదలవుతుంది. దాన్ని బయటకు పంపేవరకు దగ్గు వస్తూ ఉంటుంది. 

స్మోకింగ్​ వల్ల హార్ట్​ ఎటాక్?

స్మోకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ ఎక్కువ. పొగతాగేటప్పుడు అందులోని కెమికల్స్ పీల్చడం వల్ల గుండె, బ్లడ్ వెజల్స్ అథెరొస్ల్కెరొసిస్​ లేదా ప్లేగుని డెవలప్ చేస్తుంది. ఎక్కువ స్మోక్ చేయడం వల్లనే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనుకుంటారు. కానీ, కాదు. ఎప్పుడైనా ఒకసారి పొగతాగినా గుండె, బ్లడ్ వెజల్స్ డ్యామేజ్​కి కారణమవుతుంది. కొంతమందికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి, డయాబెటిస్, బర్త్​ కంట్రోల్ మందులు వాడే ఆడవాళ్లలో రిస్క్ ఎక్కువ. సిగరెట్​లో ఉండే కెమికల్స్ వల్ల రక్తనాళాలను ఆనుకుని ఉండే కణాలు ఉబ్బుతాయి. దాంతో రక్త నాళాలు ఇరుకుగా అయిపోతాయి. అప్పుడు గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. 

స్మోకింగ్ వ్యసనంగా మారితే.. 

స్మోకింగ్​ అనేది వ్యసనంగా మారితే... లక్షణాలు ఇలా ఉంటాయి. ఒకటి రెండు సార్లు సీరియస్​గా ప్రయత్నించినా అలవాటు మానలేరు. కానీ, ఎప్పుడైతే మానేయాలని ప్రయత్నిస్తే, శారీరకంగా, మానసికంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే... బలమైన కోరికలు, యాంగ్జైటీ, చిరాకు, అలసట, ఏకాగ్రత కోల్పోవడం, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, కోపం, ఆకలి ఎక్కువవడం, ఇన్​సోమ్నియా, మలబద్ధకం లేదా డయేరియా వంటివి. సోషల్ యాక్టివిటీస్​కి దూరంగా ఉంటారు. స్మోక్​ ఫ్రీ రెస్టారెంట్​లకు వెళ్లడం కూడా మానేయొచ్చు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో కలవడం మానేస్తుంటారు. వీటన్నింటికీ కారణం ఏంటంటే... స్మోక్ చేయకుండా ఉండాల్సి వస్తుంది కాబట్టి. సాధారణంగా స్మోకింగ్ మానేయాలంటే రెండు నుంచి నాలుగు వారాలు పడుతుంది. కొంతమందికి అంతకంటే ఎక్కువ టైం పట్టొచ్చు. ఒక్కోసారి పొగ తాగాలనిపించొచ్చు. మరోసారి వద్దనిపించొచ్చు. కానీ, ఏదో ఒక టైంకి మానేస్తారు. పొగ తాగడం మానేయాలనుకునేవాళ్లు టార్గెట్ పెట్టుకోవడం బెటర్. ఒక వారం అనుకుంటే అంతకంటే ఎక్కువ రోజులే మానేసే ఛాన్స్ ఉంది. ఇలా టార్గెట్ పెట్టుకుని మానేసే వాళ్లలో తొమ్మిది శాతం సక్సెస్ అయినట్టు రికార్డ్​లు చెప్తున్నాయి. 

స్మోకింగ్​కి బదులు...

స్మోకింగ్ మానాలంటే దాన్నుంచి మైండ్ డైవర్ట్ చేయాలి. అలా చేయాలనుకుంటే నికొటిన్ రిప్లేస్​మెంట్ థెరపీ (ఎన్​ఆర్​టి) ప్రయత్నించాలి. అదెలాగంటే...నాజల్ స్ర్పే లేదా ఇన్​హేలర్​ ద్వారా నికొటిన్​ని తీసుకోవడం. నికొటిన్ ప్యాచెస్​, గమ్, లాంజెస్ వంటివి తీసుకోవడం. లేదంటే బుప్రొపియన్, వరెనిక్లైన్ అనే మందులు వాడొచ్చు. అలాగే, స్మోకింగ్ మానడానికి ఈ మధ్య ఇ– సిగరెట్ల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ, ఇ– సిగరెట్లు సేఫ్, నికొటిన్​ని రీప్లేస్ చేసేందుకు పనికొచ్చే మెడిసిన్​ అని గానీ, ప్రజలు స్మోకింగ్ మానేయడానికి సాయం చేస్తుందని గానీ ఎక్కడా రుజువు కాలేదు. అందుకే  మన దేశంలో ఇ– సిగరెట్ల అమ్మకాలపై బ్యాన్​ పెట్టారు.    

మానేస్తే ఊపిరితిత్తులు బాగవుతాయి!

పొగతాగడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినడం ఎంత నిజమో, అది మానేయడం వల్ల అవి మళ్లీ కోలుకుంటాయనేది కూడా అంతే నిజం. ఊపిరితిత్తులు సెల్ఫ్ క్లీనింగ్ చేసుకోగలవు. అంటే... వాటంతట అవే నయం చేసుకుంటాయి. రీజనరేట్ కూడా అవుతాయి. కాబట్టి ఎంత త్వరగా మానేస్తే ఆరోగ్యానికి అంత మంచిది. కాకపోతే, అవి పూర్తిగా కోలుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కో సమయం పడుతుంది. 

ఇ–సిగరెట్​లు 

సిగరెట్​లను రీప్లేస్ చేయడంలో ఇ–సిగరెట్​లు బాగా పనికొస్తాయి. వీటిలో కూడా నికొటిన్ ఉంటుంది. ఇది సిగరెట్​ కంటే బెటర్, ఎలాంటి చెడు ప్రభావం ఉండదు అని కొందరు అనుకుంటారు. కానీ, అలాంటిదేం లేదు.. ఇది కూడా రిస్కే. ఇందులో కూడా టాక్సిన్స్ ఉంటాయి. వ్యసనంగా మారే అవకాశం కూడా ఉంది. వీటిలో నికొటిన్​తోపాటు ఊపిరితిత్తుల్లోకి లోతుగా పీల్చగలిగే అల్ట్రాఫైన్ పార్టికల్స్, ఫ్లేవరెంట్​లు, అస్థిర కర్బన సమ్మేళనాలు, నికెల్, టిన్, లెడ్ వంటి భారీ లోహాలతో ఉంటాయి. అవి చాలా హానికరం.వీటిని వాడడం వల్ల దగ్గు, నోరు ఎండిపోవడం, గొంతు నొప్పి, శ్వాస ఆడకపోవడం, తలనొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం సహజం. అన్నింటికంటే ముఖ్యంగా, ఇ–సిగరెట్​లు సేఫ్​ అని ఎక్కడా రుజువు కాలేదు.  

నో టొబాకో డే

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్​ (డబ్ల్యూహెచ్​వో) 1997లో పొగాకు వల్ల జరిగే నష్టాల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవేర్​నెస్ కల్పించేందుకు గానూ ‘వరల్డ్ నో టొబాకో డే’ని ప్రకటించారు. దీన్ని ప్రతి ఏటా మే 31న జరుపుతారు. ఈ ఏడాది థీమ్​ ఏంటంటే.. ‘వీ నీడ్ ఫుడ్, నో టొబాకో’. అంటే మాకు తిండి కావాలి. పొగాకు వద్దు అని అర్థం. ఈ డే సెలబ్రేషన్స్​లో సిగరెట్ లేదా పొగాకుతో తయారయ్యే ఇతర ప్రొడక్ట్​ల వల్ల ఒక వ్యక్తి ఆరోగ్యం పై ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయనేది హైలైట్ చేస్తారు. 
త్వరగా మానాలంటే...

  •     ఎక్సర్​సైజ్ చేయడం కూడా అలవాటు చేసుకోండి.
  •     సపోర్ట్​, సలహా    స్మోకింగ్ అలవాటు త్వరగా మానేయాలనుకునేవాళ్లు గట్టిగా నిర్ణయించుకోవాలి. మోటివేషన్ చాలా అవసరం.  
  •     పొగతాగడం మానేయాలనుకున్నప్పుడు ఆ రోజుని క్యాలెండర్​లో గుర్తుపెట్టుకోండి.  తర్వాత ఎందుకు మానేయాలనుకుంటున్నారో లిస్ట్​ రాయండి. 
  •     స్మోక్ చేయాలనిపించినప్పుడు దాన్నుంచి డైవర్ట్ అవడం కోసం ఏం చేస్తారో ప్లాన్ చేసుకోండి.
  •     చుట్టూ ఉండేవాళ్లకు స్మోకింగ్ మానేస్తున్నా.. కచ్చితంగా మానేస్తా అని తరచూ చెప్తూ ఉండండి. 
  •     ఇంతకుముందు స్మోకింగ్ మానేయాలనుకున్నప్పుడు ఏం చేశారో గుర్తుచేసుకోండి. 
  •     బిజీగా ఉండాలని బలంగా కోరుకోండి. అందుకోసం బాగా ప్రయత్నించండి.
  •      సపోర్ట్​, సలహాలు తీసుకునేందుకు ఆన్​లైన్​లో లేదా ఆఫ్​లైన్​ గ్రూప్​ల్లో గానీ చేరండి.                           
  •     వీటితోపాటు.. మీ దగ్గర ఉన్న సిగరెట్లన్నీ తీసి పడేయండి. ఒక్క సిగరెట్ కూడా లేకుండా పడేస్తే, కచ్చితంగా స్మోకింగ్ మానేయగలరు. 

పాసివ్ స్మోకింగ్ ఎఫెక్ట్ 

సిగరెట్లు తాగని వాళ్లకు ఎలాంటి ప్రాబ్లమ్​ రాదు అనుకుంటే పొరపాటు. వేరే వాళ్లు తాగుతున్నప్పుడు దాన్నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని సెకండ్ హ్యాండ్​ స్మోక్
 (ఎస్​.హెచ్.ఎస్) అంటారు. దీనివల్ల పెద్దవాళ్లలో హార్ట్​ ఎటాక్, స్ట్రోక్, లంగ్​ క్యాన్సర్, ఆడవాళ్లలో పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. పిల్లలు కూడా తక్కువ బరువుతో పుడతారు. 
సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల శిశువులు కూడా ఎఫెక్ట్​ అవుతారు. సడెన్ ఇన్​ఫాంట్​ డెత్​ సిండ్రోమ్ (ఎస్​.ఐ.డి.ఎస్​), చెవి, శ్వాస సంబంధమైన ఇన్ఫెక్షన్స్, ఆస్తమా ఎటాక్స్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది.

డాక్టర్. పాలంకి సత్య దత్తాత్రేయ  డైరెక్టర్ & చీఫ్​ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్  రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్  కార్ఖానా, సికింద్రాబాద్