- 31న క్లాసుల బహిష్కరణ, కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే చొరవ తీసుకుని నిధులు విడుదల చేయాలని డిమాండ్చేశారు. ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో యువజన అధ్యక్షుడు జిల్లపల్లి అంజి నేతృతంలో నీల వెంకటేశ్, అనంతయ్యల అధ్యక్షతన వివిధ బీసీ, విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని కోరారు.
ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు అధికారులు, మంత్రులు, సీఎం దృష్టికి తీసుకెళ్లినా బకాయిలు విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. ఫీజు బకాయిల కోసం ఈ నెల 31న రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసన చేపడతారని తెలిపారు. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడించి అధికారులకు వినతిపత్రాలు ఇస్తామని చెప్పారు. కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు చెల్లించే ప్రభుత్వం.. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించేందుకు నిధులు లేవా అని ప్రశ్నించారు. ఫీజులు చెల్లించని విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుబట్టారు. సమావేశంలో సి. రాజేందర్, తాళ్లపల్లి రామకృష్ణ గౌడ్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
