యురేనియం జీవరాశి మనుగడకే ప్రమాదం : R.నారాయణమూర్తి

యురేనియం జీవరాశి మనుగడకే ప్రమాదం : R.నారాయణమూర్తి

యురేనియం జీవరాశి మనుగడకు ప్రశ్నార్థకంగా మారుతుందని సినీనటుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. నల్లమల ఈజ్ అవర్స్ నినాదంతో నాంపల్లిలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సులో మూర్తి పాల్గొన్నారు. చీఫ్ గెస్ట్ రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ చంద్ర కుమార్ తో పాటు  సైంటిస్ట్ బాబు రావు, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్ర మూర్తి, మాజీ ఐఆర్ఎస్ ప్రసాద్ శాస్త్రి, యూత్ హాజరయ్యారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు, సర్వేలు ఆపాలని డిమాండ్ చేశారు. నల్లమలలో తవ్వకాలు జరిగితే మానవాళి అంతరించిపోతుందన్నారు.

యురేనియం, బాక్సైట్ తవ్వకాలు చేయకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఉందని అన్నారు నారాయణమూర్తి. దండకారణ్యంలో యురేనియం తవ్వకాలు చేస్తే అక్కడ చెంచులు, ఆదివాసీలు అంతరించే ప్రమాదం ఉందన్నారు. యురేనియం గాలిలో , నీటిలో కలిస్తే అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోతారని చెప్పారు. పుట్టబోయే పిల్లలు చిత్ర విచిత్రంగా పుడుతారని అన్నారు. అడవులు, ఆదివాసీలు, ప్రకృతి నాశనం కాకుండా ఉండాలి అంటే యురేనియం తవ్వకాలు నిలిపివేయాలని అన్నారు నారాయణమూర్తి. గిరిజనుల కోసం తెచ్చిన చట్టాలను ప్రభుత్వమే పట్టించుకోవడం లేదన్నారు. సేవ్ నల్లమలకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం మంచి పరిణామం అని నారాయణమూర్తి చెప్పారు.