మరోసారి మానవత్వం చాటుకున్న రాహుల్ గాంధీ.. 22 మంది పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయం

మరోసారి మానవత్వం చాటుకున్న రాహుల్ గాంధీ.. 22 మంది పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది పిల్లలను దత్తత తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో 2025, ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.

 ఈ టెర్రర్ ఎటాక్‎లో 26 మంది టూరిస్టులు చనిపోయారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థా్న్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్‎కు ప్రతీకారంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి జమ్మూ కాశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వెంబడి అనేక సెక్టార్లలో సాధారణ పౌరులే లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం భారీ షెల్లింగ్‌కు పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన భారత సైనం పాక్ కాల్పులను తిప్పికొట్టినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

పాక్ సైన్యం కాల్పుల్లో చాలా మంది ప్రజలు చనిపోయారు. ఈ ఘటన అనంతరం మే నెలలో రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో పర్యటించి పాక్ సైనికుల కాల్పుల్లో మరణించిన కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే పాక్ సైనికుల షెల్లింగ్‎లో ప్రాణాలు కోల్పోయిన 22 మంది పిల్లలను రాహుల్ గాంధీ దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వారి బాగోగులను మొత్తం ఇకపై ఆయన చూసుకోనున్నారు.