ఏసీ రైళ్ల చార్జీల్లో డిస్కౌంట్..   ఆఫర్ ప్రకటించిన రైల్వే శాఖ  

ఏసీ రైళ్ల చార్జీల్లో డిస్కౌంట్..   ఆఫర్ ప్రకటించిన రైల్వే శాఖ  

న్యూఢిల్లీ, వెలుగు: సిట్టింగ్ అకామడేషన్ ఉన్న ఏసీ రైళ్ల చార్జీల్లో రైల్వే శాఖ డిస్కౌంట్ స్కీంను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా గడచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో ఈ ఆఫర్‌‌‌‌ను ప్రకటించాలని రైల్వే జోన్లకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. వందే భారత్, అనుభూతి, విస్టాడోమ్ కోచ్‌‌‌‌లతో సహా అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాసెస్ కు ఈ స్కీం వర్తించనునట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త స్కీం సంబంధిత ఏసీ రైళ్లలో తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.

ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తించదని, చార్జీలు తిరిగి ఇవ్వరని స్పష్టం చేసింది. స్కీం కింద టికెట్ చార్జీలో గరిష్టంగా 25 శాతం డిస్కౌంట్ వర్తించనుందని.. రిజర్వేషన్, జీఎస్‌‌‌‌టీ, సూపర్‌‌‌‌ఫాస్ట్ చార్జీలను వేరుగా విధించనున్నట్లు తెలిపింది. డిమాండ్‌‌‌‌ను బట్టి నెలవారీ, సీజనల్ వారీ, వారాంతపు రోజుల్లో ఈ స్కీం ఆరు నెలల పాటు అమలు కానుందని పేర్కొంది. ఆరు నెలల తర్వాత ఆయా రైళ్లలో ఆక్యుపెన్సీ రిపోర్ట్ ను బట్టి ఈ స్కీంను సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. అయితే  స్పెషల్ ట్రైన్లకు ఈ స్కీం వర్తించదని స్పష్టం చేసింది.