చిరు జల్లులతో చల్లబడిన తెలంగాణ.. ఈ జిల్లాల్లో ఉరుములతో వర్షాలు

చిరు జల్లులతో చల్లబడిన తెలంగాణ.. ఈ జిల్లాల్లో ఉరుములతో వర్షాలు

అగ్నిగోలంలా మండుతున్న తెలంగాణ.. మధ్యాహ్నం తర్వాత కురుస్తున్న చిరుజల్లులతో కాస్త చల్లబడింది. బుధవారం (జూన్ 03) మధ్యాహ్నం 3 గంటల తర్వాత పలు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఉమ్మడి  వరంగల్ జిల్లాలోని హన్మకొండ, నర్సంపేట, హసన్ పర్తి, పరకాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలో ఓ మోస్తారుగా వర్షం కురిసింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 

ఇక రానున్న రెండు మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40.కి.మీ. కంటే తక్కువ (గాలులతో) తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. 

  • హైదరాబాద్ లో.. 

హైదరాబాద్ లోనూ సాయంత్రం వర్షం కురిసే చాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. పటాన్‌చెరు, లింగంపల్లి, ఆర్‌సి పురం, శేరిలింగంపల్లి, కొండాపూర్, మియాపూర్, హఫీజ్‌పేట్, తెల్లాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, నిజాంపేట్, మాదాపూర్, జూబ్లీహిల్స్, దమ్మాయిగూడ తదితర ప్రాంతాలలో వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. వర్షాలను దృష్టిలో ఉంచుకుని నగర వాసులు ప్లాన్ చేయాలని సూచించింది.