రాజీవ్ స్వగృహ ప్లాట్లకు  భారీ స్పందన

రాజీవ్ స్వగృహ ప్లాట్లకు  భారీ స్పందన
  • తొర్రూర్‌‌లో గజం రూ.45వేలు పలికిన భూమి
  • బహదూర్ పల్లిలో చదరపు గజం రూ. 40, 500
  • కార్పొరేషన్‌కు రూ.83  కోట్ల మేర ఆదాయం 

హైదరాబాద్, వెలుగు: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి, మేడ్చల్–-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎలాంటి వివాదాలు లేనివి, అన్ని వసతులతో అభివృద్ధి చెందినవి కావడం.. దానికి తోడు ఫ్యూచర్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌‌ఆర్)కు సమీపంలో ఉండటంతో బిడ్డర్లు ఈ ప్లాట్లను కొనుగోలు చేయడానికి భారీగా పోటీ పడ్డారు. పెద్ద అంబర్‌పేటలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సోమవారం ఈ బహిరంగ వేలం నిర్వహించారు.

మొత్తం 85 ఓపెన్ ప్లాట్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.83 కోట్ల మేర ఆదాయం సమకూరినట్టు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ వేలంలో మొత్తం 150 మంది బిడ్డర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్దేశించిన కనీస ధర కంటే చాలా ఎక్కువ మొత్తానికి బిడ్డర్లు పోటీ పడి ప్లాట్లను దక్కించుకోవడం విశేషం. ఓఆర్ఆర్, ఆదిభట్ల ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న తొర్రూర్‌లో 200 నుంచి 700 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 66 ప్లాట్లకు భారీ డిమాండ్ పలికిందని ఎండీ వీపీ గౌతమ్ చెప్పారు.

ఇక్కడ చదరపు గజానికి కనీస ధర రూ.25,000గా నిర్ణయించగా.. వేలంలో బిడ్డర్లు పోటీ పడటంతో గరిష్టంగా రూ.45,500 ధర పలికిందని పేర్కొన్నారు. ఇక్కడ సగటున గజానికి రూ.32,500 చొప్పున ప్లాట్లు అమ్ముడయ్యాయని వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఆర్‌సీఐకి అత్యంత సమీపంలో ఉన్న కుర్మల్‌గూడలో 200 నుంచి 400 చదరపు గజాల విస్తీర్ణంలోని 11 ప్లాట్లకు కూడా భారీ స్పందన లభించిందని వివరించారు. ఇక్కడ చదరపు గజం కనీస ధర రూ.20,000 కాగా.. వేలంలో గరిష్టంగా రూ.27,500 ధర పలికిందని ఎండీ  గౌతమ్ వెల్లడించారు.

ఔటర్ రింగ్ రోడ్‌ను ఆనుకుని ఉన్న బహదూర్‌పల్లి ప్రాంతంలో 200 నుంచి 1,000 చదరపు గజాల విస్తీర్ణంలోని 8 ప్లాట్లకు కూడా కొనుగోలుదారులు పోటీ పడ్డారని ఆయన తెలిపారు. ఇక్కడ చదరపు గజం కనీస ధర రూ.27,000గా నిర్ణయించగా, వేలం పాటలో గరిష్టంగా రూ.40,500 రూపాయల ధర పలికిందని చెప్పారు. ఈ లేఅవుట్‌లో సగటున గజానికి రూ.33,800 చొప్పున బిడ్డర్లు ప్లాట్లను సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు.