2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి.. ఆర్.కృష్ణయ్య డిమాండ్

2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి.. ఆర్.కృష్ణయ్య డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో ఆదివారం బషీర్‌‌బాగ్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ఆయన భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో జరిగిన సమావేశంలో గంజి ప్రసాద్​కు బీసీ సంఘం ఏపీ ప్రధాన కార్యదర్శిగా నియామకపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత అండతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. ఉద్యోగాలు రాక యువతకు పెండ్లిళ్లు కూడా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పోలీస్ శాఖలో 18 వేల పోస్టులు, 30 వేల టీచర్ పోస్టులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లోని ఖాళీలను భర్తీ చేయాలని, లేనిపక్షంలో నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు.