న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు నియమిత కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ)లో కొన్ని నెలలు సభ్యుడిగా పని చేసినందుకు తనకు చెల్లించనున్న రూ. 40 లక్షలను ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ తిరస్కరించారు. బీసీసీఐ నుంచి తాను ఎలాంటి డబ్బులను ఆశించడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఓఏ తొలి సమావేశంలోనే చెప్పానని గుర్తు చేశారు. మరో సభ్యుడు విక్రమ్ లిమాయె కూడా తనకు ఇస్తామన్న రూ. 50.5 లక్షలను కూడా తీసుకోవడానికి అంగీకరించలేదు. గుహ చెప్పిన కారణాలనే లిమాయె కూడా వెల్లడించారు. జనవరి 30, 2017న సుప్రీం కోర్టు.. కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన సీఓఏను నియమించిన సంగతి తెలిసిందే. మహిళల టీమ్ మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ, గుహ, లిమాయె ఇందులో సభ్యులుగా ఉన్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో గుహ జులై 2017లో కమిటీకి రాజీనామా చేశాడు. కొద్ది రోజుల తర్వాత లిమాయె కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇక రాయ్, ఎడుల్జీ 33 నెలల పాటు సీఓఏ బాధ్యతలను నిర్వహించినందుకు బీసీసీఐ చెరో మూడున్నర కోట్ల రెమ్యునరేషన్‌ను ఇవ్వనుంది.


