బీజేపీలో కోవర్టుల్లేరు.. కాంగ్రెస్‌‌‌‌లో కోవర్టు లెవరో మాకేం తెలుసు

బీజేపీలో కోవర్టుల్లేరు.. కాంగ్రెస్‌‌‌‌లో కోవర్టు లెవరో మాకేం తెలుసు
  •     మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు బీజేపీకి సంబంధం లేదు: రాంచందర్ రావు 
  •     ప్రధానిగా మోదీ 12 ఏండ్లు సువర్ణ పాలన చేపట్టారని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బీజేపీలో కోవర్టులు లేరని, కాంగ్రెస్‌‌‌‌ పార్టీలో కోవర్టులు ఎవరున్నారో తమకు తెలియదని బీజేపీ స్టేట్‌‌‌‌ చీఫ్‌‌‌‌ ఎన్.రాంచందర్ రావు అన్నారు. బీజేపీకి తెలంగాణలో బలం పెరుగుతోందని, అందుకే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని విమర్శించారు. నీట్ పరీక్షలో పొరపాటు జరిగిందని గుర్తించారని, అయితే విద్యార్థులను రెచ్చగొట్టడం మంచిది కాదని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసి నరేంద్ర మోదీ కొత్త చరిత్ర సృష్టించారని, ఇది ఆయన 12 ఏండ్ల సువర్ణ పాలనకు నిదరర్శమన్నారు. 

బుధవారం హైదరాబాద్‌‌‌‌లోని బేగంపేట హరిత ప్లాజాలో మోదీ 12 ఏండ్ల పాలనపై దేశ నిర్మాణమే ఏకైక లక్ష్యం అనే పుస్తకాన్ని పార్టీ నేతలతో కలిసి రాంచందర్ రావు ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘మహారాష్ట్ర ముఖ్యమంత్రికి.. సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయలేదు. ఒకవేళ లేఖ రాస్తే.. దానిని బయటపెట్టాలి. అపాయింట్‌‌‌‌మెంట్ అడిగితే.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కచ్చితంగా ఇస్తారు. కానీ ఈ విషయంలో రేవంత్ అబద్ధాలు చెబుతున్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇదే తరహాలో ఆరోపణలు చేశారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది”అని హెచ్చరించారు. ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి అనేక సార్లు కలిశారని, హైదరాబాద్‌‌‌‌లో కూడా ప్రధానిని కలిశారని గుర్తుచేశారు. 

సీఎం.. ఢిల్లీకి వెళ్లి ఎవరెవరిని కలిశారో తన దగ్గర సమాచారం ఉందన్నారు. అభివృద్ధిలో కలిసి రావాలని సీఎంని మోదీ ఇటీవల బహిరంగ సభలో కోరిన విషయాన్ని రాంచందర్ రావు గుర్తుచేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేసు ఉందనే విషయం అఫిడవిట్‌‌‌‌లో చెప్పకుండా దాచిపెట్టడంతోనే తిరస్కరణకు గురైందని చెప్పారు. యూపీఏ1, యూపీఏ2లో అనేక కుంభకోణాలు చూశామని, 12 ఏండ్ల మోదీ పాలనలో అభివృద్ధి, సంక్షేమం, దేశ రక్షణను చూశామని ఆయన తెలిపారు. ప్రధానిగా అత్యధిక కాలం సేవలందించి సరికొత్త రికార్డు సృష్టించారన్నారు. మోదీ 12 ఏండ్ల సువర్ణ పాలన దేశ ప్రగతికి అసలైన నిదర్శనమని కొనియాడారు.