- దేశభక్తి అంటే ప్రాణత్యాగమే కాదు.. సేవ చేయడం కూడా
- బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు
- 10 సూచనలతో కూడిన పాంప్లెట్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. దేశభక్తి అంటే సరిహద్దుల్లో ప్రాణత్యాగం చేయడం మాత్రమే కాదని, దేశ ఆర్థిక భద్రతలో పాలుపంచుకోవడం కూడా దేశభక్తేనని చెప్పారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ప్రధాని మోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ సూచించిన 10 ప్రధాన అంశాల పాంప్లెట్‌ను విడుదల చేశారు.
అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సూచనలు రాజకీయ పరమైనవి కావని, అవి దేశ ప్రయోజనాల కోసం చేసినవని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లు, ద్రవ్యోల్బణం ఉన్న నేపథ్యంలో ప్రజలు మితవ్యయం పాటించాలని కోరారు. ప్రధాని స్వయంగా తన కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించుకుని ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. ప్రజలు కూడా విలాసాలకు పోకుండా మెట్రో, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా వ్యవస్థలను వాడాలని, ఐటీ ఉద్యోగులు కార్‌పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని సూచించారు. గతంలో మన్మోహన్ సింగ్, ఇందిరా గాంధీ వంటి వారు కూడా ఆర్థిక ఇబ్బందుల సమయంలో పొదుపు చర్యలు చేపట్టారని, ఇప్పుడు మోదీ సూచనలను విమర్శించడం సరికాదని హితవు పలికారు.
ఆర్థిక రక్షణకు సప్త సూత్రాలే మార్గం: కృష్ణారెడ్డి
ఆర్థిక రక్షణకు సప్త సూత్రాలే మార్గమని ప్రముఖ ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రధాని సూచించిన సప్త సూత్రాలపై సమగ్ర విశ్లేషణ చేశారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవాలంటే స్వదేశీ ఉత్పత్తుల వాడకం పెరగాలన్నారు. వంట నూనెల దిగుమతులు తగ్గించేలా వినియోగంలో నియంత్రణ, ఇంధన పొదుపు, సహజ వ్యవసాయం, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి అంశాలు దేశ ఆర్థిక స్థిరత్వానికి ఎంతో మేలు చేస్తాయని గణాంకాలతో వివరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర పదాధికారులు, అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
