- ప్రభుత్వ షరతులకు అంగీకరించని ఏజెన్సీలు
- అవసరమైతే టెండర్లు రద్దు చేసుకుంటామని హెచ్చరికలు
- విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఇంజినీర్ల నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: హ్యామ్ రోడ్ల కోసం టెండర్లు వేసిన ఏజేన్సీలు 5 శాతం ఎక్సెస్కే ఒప్పుకోవాలని ఆర్ అండ్ బీ శాఖ ఇంజినీర్లు కోరుతున్నారు. ఈ అంశంలో కాంట్రాక్ట్ సంస్థలను ఒప్పించేందుకు గత రెండ్రోజులుగా ఎక్సెస్ టెండర్లపై కాంట్రాక్టర్లతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వ షరతులకు ఏజేన్సీలు అంగీకరించడం లేదు. తాము వేసిన ఎక్సెస్ టెండర్లకు అగ్రిమెంట్లు చేసుకుంటామని, లేదంటే టెండర్లు రద్దు చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇంజినీర్లు నిర్ణయం తీసుకున్నారు. హ్యామ్ రోడ్ల టెండర్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. 20 శాతానికి పైగా ఎక్సెస్‌తో టెండర్లు ఇవ్వడానికి సర్కారు ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆ ప్రచారానికి చెక్ పెట్టడానికి ఇంజినీర్లు ప్రయత్నిస్తున్నారు.
హామ్ రోడ్ల టెండర్లపై కాంట్రాక్టర్లతో చర్చలు..
హ్యామ్ ప్రాజెక్ట్ ఫేజ్1 కింద రోడ్లు, భవనాల శాఖ ద్వారా రూ.13,006.27 కోట్ల వ్యయంతో 441 రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మొత్తం 6,092.37 కిలోమీటర్ల పొడవుతో 34 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవగా 5 నుంచి 23 శాతం ఎక్సెస్పై ఏజెన్సీలు టెండర్లు వేశాయి. ఫైనాన్షియల్ బిడ్లు తెరిచాక ఈ విషయం బయటికి పొక్కడంతో రాష్ట్రంలో పెద్ద దుమారం రేగింది. బీఆర్ఎస్ లీడర్లు ఈ ప్రాజెక్ట్‌తో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రచారం చేశారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్ అండ్ బీ శాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ హైవే, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల వాళ్లు ఎక్సెస్ టెండర్లకు ఒప్పందాలు చేసుకున్న విషయాలను బహిర్గతం చేసింది. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా వివరాలను మీడియాకు వెల్లడించారు. అయినా కూడా విమర్శలు తగ్గకపోవడంతో టెండర్ ప్యాకేజీపై కేవలం 5 శాతం ఎక్సెస్కే ఏజేన్సీలను ఒప్పించడానికి ఏజెన్సీ నిర్వాహకులతో ఇంజినీర్లు చర్చలు జరుపుతున్నారు.
ప్రభుత్వ షరతులకు అంగీకరించని ఏజెన్సీలు..
హ్యామ్ ప్రాజెక్ట్ పురోగతిపై ప్రభుత్వ విధించే షరతులకు ఏజేన్సీలు అంగీకరించడం లేదని తెలిసింది. పెద్ద కంపెనీలే టెండర్లు వేయడంతో, తాము వేసిన రేటునే ఖరారు చేయాలని పట్టుబడుతున్నాయి. ‘ఈ ప్రాజెక్టులోకేవలం 40 శాతం నిధులు మాత్రమే వర్క్ పీరియడ్‌లో చెల్లిస్తారని, మిగతా 60 శాతం నిధులకు 15 ఏండ్లు వేచిచూడడంతో పాటు జీఎస్టీ అదనపు భారం, ఇతర మెయింటెనెన్స్, యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకోవాలని ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు. జీఎస్టీ, వడ్డీ ప్రభావం వల్ల ఏజేన్సీపై సుమారు 9.30 శాతం అదనపు భారం పడుతోందని పేర్కొంటున్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇంజినీర్ల నిర్ణయం..
హ్యామ్ ప్రాజెక్ట్ టెండర్ల విషయంలో ఏజేన్సీలు ఎంత చెప్పినా తగ్గకపోవడంతో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఆర్ అండ్ బీ శాఖ ఇంజినీర్లు నిర్ణయం తీసుకున్నారు. టెండర్లలో పేర్కొన్న అంశాల్లో 15 ఏండ్ల నిర్వహణ బాధ్యత, పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్ సేవలు వంటి వాటిపై పునరాలోచనలో పడినట్లుగా తెలిసింది. కొన్ని నిబంధనలు మార్చి మళ్లీ టెండర్లు పిలవాలా? లేక పాత టెండర్ల ప్రకారం దాఖలైన వాటిలో ఎక్సెస్పైనే టెండర్లను అంగీకరించి ఏజేన్సీలతో అగ్రిమెంట్లు చేసుకోవాలా? అనే విషయంపై ప్రభుత్వ ఆమోదానికి ఇంజినీర్లు ఫైల్ రెడీ చేస్తున్నారు. వీటిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తే తప్ప హ్యామ్ టెండర్లు ముందుకు సాగేలా కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు.
