శ్రీలంకలో ఏం జరుగుతోంది..?

శ్రీలంకలో ఏం జరుగుతోంది..?

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి. జనం ఆందోళనలతో భయపడిపోయిన  ప్రెసిడెంట్ గొటబాయ రాజపక్స పత్తాలేకుండా పోయారు. అధ్యక్ష భవనం ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయింది. అజ్ఞాతంలో ఉన్న రాజపక్స బుధవారం రాజీనామా చేస్తానని ప్రకటించినా జనం ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు. దేశం విడిచివెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఆయనను నిరసనకారులు అడుగడుగునా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అధ్యక్ష భవనం ఇప్పుడు ఓ టూరిస్టు స్పాట్లా మారిపోయింది. ఇంతకీ శ్రీలంక రావణ కాష్టంలా రగిలేందుకు కారకులెవరు..? కొత్త ప్రభుత్వం ఏర్పడితే సమస్యలు సమసిపోతాయా..?

ప్రజల చేతుల్లో అధ్యక్ష భవనం

శనివారం భారీగా తరలివచ్చిన శ్రీలంక ప్రజలు అధ్యక్ష నివాసాన్ని చుట్టుముట్టారు.  బలగాల తుపాకీ గుళ్లకు ఏ మాత్రం భయపడకుండా ముందుకు కదిలారు. గుళ్ల వర్షం కురుస్తున్నా, టియర్ గ్యాస్ కమ్మేసినా వెనకడుగు వేయలేదు. కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లారు. ప్రజల ఆవేశం చూసి బలగాలు పక్కకు తప్పుకున్నాయి. అంతే.. వేలాది మంది నిరసనకారులు జాతీయ జెండాలు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఒక్కసారిగా అధ్యక్ష భవనంలోకి చొరబడ్డారు. గదులన్నీ కలియతిరిగి అక్కడున్న సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. ఒకవైపు దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు అధ్యక్ష భవనంలో భారీగా నోట్ల కట్టలు దొరికినట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. 

అధ్యక్ష భవనానికి క్యూ కట్టిన జనం

అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లిన జనం అక్కడి సౌకర్యాలన్నింటిని ఎంజాయ్ చేస్తున్నారు. అధ్యక్షుడు కుర్చీలో కూర్చుని సెల్ఫీలు తీసుకుంటున్నారు. బెడ్ రూంలో పరుపులపై డ్యాన్సులు, రెజ్లింగ్ లు చేస్తున్నారు. అత్యాధునిక పరికరాలున్న జిమ్ లో ఎక్సర్ సైజ్ లు, స్విమ్మింగ్ పూల్ లో స్నానాలు, భవనం ముందు ఖాళీ స్థలంలో వంటలు వండుకుని తింటున్నారు. బీరువాల్లో ఉన్న అధ్యక్షుడి ఖరీదైన వస్తులను తీసేసుకున్నారు. దేశ ప్రజలు పిడికెడు మెతుకులు లేకుండా అల్లాడుతుంటే దేశాధ్యక్షుడు మాత్రం ఇన్ని రోజులు ఖరీదైన వస్తువులతో ప్రతి రోజు రాజభోగాలు అనుభవిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసనకారులు అధ్యక్ష భవనంలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలుసుకున్న జనం అక్కడికి క్యూ కడుతున్నారు.

సరికొత్త టూరిస్ట్ స్పాట్

శ్రీలంక అధ్యక్ష భవనం ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ లా మారింది. అందులోని విలాసవంతమైన సౌకర్యాలను చూసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. భవనం మొత్తాన్ని పరిశీలించి కొందరు బయటకు వస్తుంటే మరికొందరు లోపలికి వెళ్తున్నారు. అధ్యక్ష భవనాన్ని చూసే అవకాశం ప్రజలందరికి వచ్చేలా  సహకరించాలని మతపెద్దలు పిలుపునిచ్చారు. మొదట ప్రజలను అడ్డుకున్న పోలీసులు, భద్రతా బలగాలు.. ఇప్పుడు వారిని క్రమపద్దతిలో అధ్యక్ష భవనంలోకి పంపే పనిలో బిజీ అయిపోయారు. అక్కడ ఏం జరుగుతున్నా కేవలం చూస్తూ ఉండిపోతున్నారు. 

నెలలుగా కొనసాగుతున్న నిరసనలు

ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోయిన శ్రీలంకలో కొన్ని నెలలుగా నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే గతవారం తీవ్రరూపం దాల్చాయి. శనివారం లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గొటబాయ తీరుతో నిత్యావసరాలు, ఇంధనం సహా ప్రతి వస్తువు కోసం ఇబ్బంది పడుతున్న నిరసనకారులు ప్రధాని నివాసానికి నిప్పుపెట్టారు. శ్రీలంకలో పరిస్థితి మరోసారి చేయిదాటిపోవడంతో అక్కడ ఏం జరగబోతోందన్ని ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అక్కడి రాజకీయ పరిస్థితులు ఎలా మారబోతున్నాయి...? కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది ఎవరన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఇష్యూగా మారింది. అయితే ఈ విషయంపై రాజ్యంగంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయంటున్న రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంటులో మరో సభ్యుడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సి ఉంటుందని, ఆ పదవి చేపట్టేవారు పదవీ కాలంలో మిగిలిన కాలానికి మాత్రమే అధ్యక్షుడిగా కొనసాగుతారుని స్పష్టం చేస్తున్నారు.

సమస్యల వలయం

కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు శ్రీలంకలో నెలకొన్న  పరిస్థితులకు చాలా రీజన్లు ఉన్నాయి. ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల ఫలితంగా దాదాపు 51 బిలియన్ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయింది. కనీసం వాటికి వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చింది. శ్రీలంకకు మెయిన్ ఇన్ కం సోర్స్ గా ఉన్న టూరిజం కూడా పూర్తిగా పడిపోయింది. వరుస ఉగ్రదాడులు, కరోనాతో పర్యాటకం పూర్తిగా దెబ్బతింది. కరెన్సీ విలువ 80 శాతం పడిపోయి ద్రవ్యోల్బణం 57 శాతానికి చేరింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. కనీసం గ్యాసోలిన్‌, పాలు, కుకింగ్‌ గ్యాస్‌ వంటి నిత్యావసరాల దిగుమతికి కూడా డబ్బులు చెల్లించని పరిస్థితి ఏర్పడింది.

రాజకీయ అవినీతి

శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులకు రాజకీయ అవినీతే కారణమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దేశ సంపదంతా కొందరి చేతుల్లోకే వెళ్లిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ కోలుకోలేని పరిస్థితి దాపురించింది. శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి ఇలా అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారే. ఈ కుటుంబం చేసిన అంతులేని అవినీతి మూలంగానే దేశం ఇంతటి దారుణ పరిస్థితికి చేరిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి శ్రీలంకలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది లేదు. కొన్ని సంవత్సరాలుగా ఆ దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు తిండిలేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఐక్యరాజ్యసమితి ఫుడ్‌ ప్రోగ్రాం ప్రకారం శ్రీలంకలో 10 కుటుంబాల్లో 9 కుటుంబాలు ఒక పూట భోజనం కూడా చేయలేకపోతున్నాయి. ప్రస్తుతం 30 లక్షల మంది అత్యవసర మానవతా సాయం కింద అందుతున్న ఆహారంతోనే బతుకుతున్నారు. అందుకే ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

నెల రోజుల్లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ

శ్రీలంకలో అధ్యక్షుడు రాజీనామా చేసిన నెల రోజుల్లోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ మొదలు కావాల్సి ఉంటుంది. అధ్యక్షుడు రాజీనామా చేసిన మూడు రోజుల్లోగా పార్లమెంటు సమావేశమై.. అధ్యక్షుడి రాజీనామాపై పార్లమెంటు సెక్రటరీ జనరల్ ప్రకటన చేస్తారు. ఆ తర్వాత సభ్యుల్లో ఒకరి కంటే ఎక్కువ మంది అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తే, సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తారు. ఇందులో గెలిచిన వారిని అధ్యక్షుడిగా ప్రకటిస్తారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న గోటబాయ బుధవారం రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆయన రాజీనామా చేశాక.. కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ మొదలుకానుంది. నిబంధనల ప్రకారం అప్పటి వరకు ప్రధానమంత్రి దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగాల్సి ఉంటుంది. కానీ ప్రధానమంత్రి విక్రమ సింఘె రాజీనామా చేయడంతో పార్లమెంట్ స్పీకర్ తాత్కాలికంగా అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశముంది. 

కొత్త ప్రభుత్వం కొలువుదీరినా..

కొత్త ప్రభుత్వం వచ్చినా శ్రీలంకలో పరిస్థితులు ఇప్పటికిప్పుడు చక్కబడే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం దగ్గర పైసా లేదు. అత్యవసర సేవల నిర్వహణకు కూడా చిల్లిగవ్వ లేదు. చమురు నిల్వలు దాదాపు దగ్గరపడ్డాయి. ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు మూతపడ్డాయి. విరాళాలిస్తే తప్ప నడవలేని స్థితిలో హాస్పిటళ్లు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చినా.. ఈ సమస్యలన్నీ ఇప్పటికిప్పుడు పరిష్కారమయ్యేవి కాదన్నది ఆర్థిక నిపుణులు అభిప్రాయం. శ్రీలంక మళ్లీ యథాస్థితికి రావాలంటే చాలా కాలం పడుతుందని చెబుతున్నారు. ఒకవేళ రాజకీయ సంక్షోభం ఇలాగే కొనసాగితే.. అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు కూడా అందే అవకాశం కూడా లేదని.. అప్పుడు సమస్య మరింత తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీలంకకు బెయిలవుట్‌ ప్యాకేజీపై కసరత్తు చేస్తున్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్.. తాజా పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీలంక పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పింది. బెయిలవుట్ ప్యాకేజీపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ప్రధాని విక్రమ సింఘెతో చర్చలు మొదలు పెట్టినా ఆయన రాజీనామాతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఫలితంగా IMF నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి.