ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు ఐకేపీతో చెక్​!

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు ఐకేపీతో చెక్​!

మంచిర్యాల, వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలకు చెక్​ పెట్టే దిశగా సర్కారు ఆలోచిస్తోంది. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్యాడీ పర్చేజ్​ సెంటర్ (పీపీసీ)లను ఐకేపీకి అప్పగించాలని యోచిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్​ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మొదట్లో కేవలం మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే సెంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో కొనుగోళ్ల ప్రక్రియ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సజావుగా సాగింది. 

క్రమంగా ఇందులోకి డీసీఎంఎస్, పీఏసీఎస్​లు ఎంటర్​ అయ్యాయి. సెంటర్ల కేటాయింపులో రాజకీయ జోక్యం పెరిగింది. దాంతోపాటే అవినీతి, అక్రమాలు సైతం పెరుగుతూ వచ్చాయి. బీఆర్ఎస్​ హయాంలో ధాన్యం కొనుగోళ్లపై కంట్రోల్​ తప్పింది. సెంటర్ల కేటాయింపులో పైరవీలు ఎక్కువయ్యాయి. రైతులకు మద్దతు ధర అందించడమే ధ్యేయంగా ఏర్పడిన ఈ సెంటర్లను లాభదాయక దందాగా మార్చిన ఘనత గత ప్రభుత్వానికే దక్కింది. 

కాంగ్రెస్​ వచ్చాక తగ్గిన దోపిడీ..

రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత గత వానాకాలం సీజన్​లో వడ్ల కొనుగోళ్లు చేపట్టారు. ఇప్పుడు యాసంగి వడ్లు సేకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆలస్యంగా సెంటర్లు ఓపెన్​ చేసేవారు. రైతులు వడ్లు కుప్పలు పోసి రోజుల తరబడి పడిగాపులు కాసేవారు. మాయిశ్చర్​ రావట్లేదని, గోనె సంచులు లేవని రకరకాల కారణాలు చెప్పి రైతులను గోస పుచ్చుకునేది. డీసీఎంఎస్, పీఏసీఎస్​ సెంటర్లను ప్రజాప్రతినిధులు, లీడర్ల కుటుంబీకులు, బంధువులు, అనుచరులకు అప్పగించారు. మొదట తమ దగ్గరి వాళ్ల వడ్లను కాంటా వేసి ఇతర రైతులను రేపుమాపంటూ ఇబ్బందులు పెట్టేవారు. కాంటా వేసిన తర్వాత మిల్లులకు తరలించడం, అక్కడ దించుకోవడం ఆలస్యమయ్యేది. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను అమ్ముకోవడానికి రైతులు దాదాపు నెల రోజుల పాటు తిప్పలు పడేవారు. 

ఇదంతా ఒకెత్తయితే..

మాయిశ్చర్, తాలు, తప్ప, మట్టి, రాళ్లు అంటూ సెంటర్లు, మిల్లుల్లో క్వింటాలుకు 5 నుంచి 10 కిలోలు తరుగు తీసేవారు. కాంగ్రెస్​ సర్కారు వచ్చాక వానాకాలం సీజన్​ నుంచి దోపిడీ కాస్త అదుపులోకి వచ్చింది. కొన్ని సెంటర్లలో బస్తాకు 41 నుంచి 42 కిలోలు, మరికొన్ని సెంటర్లలో సంచి వేసి 
జోకుతున్నారు. 

మహిళా సంఘాలు బలోపేతం..

గతంలోనే ధాన్యం కొనుగోళ్లలో మహిళా సంఘాలు తమ సత్తా చాటుకున్నాయి. ఒక్కో సెంటర్​ ద్వారా సంఘాలకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల కమీషన్​ వచ్చింది. నెల రోజుల కష్టానికి మహిళలకు రూ.10 నుంచి రూ.20వేలు గిట్టు బాటైంది. బీఆర్ఎస్​ సర్కారు హయాంలో ఐకేపీ సెంటర్లను తగ్గించి వాటి స్థానంలో డీసీఎంఎస్, పీఏసీఎస్​లకు కేటాయించారు. దీంతో సంఘాలకు వచ్చే ఆదాయం తగ్గింది. 

కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక మహిళా సంఘాల బలోపేతంపై దృష్టి పెట్టింది. సీఎం రేవంత్​రెడ్డి స్కూల్​ యూనిఫామ్స్​ కుట్టుపని సంఘాలకు ఇచ్చారు. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోళ్లను తిరిగి ఐకేపీకే అప్పగించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. సివిల్​ సప్లయిస్​ కార్పొరేషన్​ కమిషనర్​ దేవంద్ర సింగ్​​చౌహాన్​ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్​లో ఈ అంశంపై చర్చ జరిగినట్లు ఓ అధికారి తెలిపారు.

 గత కొన్నేండ్లుగా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈ సీజన్​లో రాష్ట్రవ్యాప్తంగా 7వేలకు పైగా సెంటర్ల ద్వారా 74 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం టార్గెట్​ పెట్టుకుంది. 4,522 పీఏసీఎస్​ సెంటర్లు, 2,216 ఐకేపీ, 411 డీసీఎంఎస్​ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో కనీసం నాలుగైదు మహిళా సంఘాలున్నాయి. వారికి ట్రైనింగ్​​ఇచ్చి సెంటర్లను అప్పగిస్తే కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

మంచిర్యాలలో డీసీఎంఎస్​, పీఏసీఎస్​లు ఔట్..

మంచిర్యాల నియోజకవర్గంలో ఈ యాసంగి సీజన్​లో డీసీఎంఎస్, పీఏసీఎస్  సెంటర్లను తొలగించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్ల బాధ్యతను పూర్తి స్థాయిలో మహిళా సంఘాలకే అప్పగించారు. బీఆర్ఎస్​హయాంలో తరుగు పేరిట క్వింటాలుకు 5 నుంచి 10 కిలోలు కటింగ్​ చేశారని ఎమ్మెల్యే తెలిపారు. గత పదేండ్లలో ఒక్క మంచిర్యాల సెగ్మెంట్​లోనే రైతుల దగ్గర దాదాపు రూ.600 కోట్లు దండుకున్నారని అంచనా వేశారు. కర్షకుల కడుపు కొట్టి దోచుకున్న మొత్తాన్ని ఎమ్మెల్యే, రైస్​మిల్లర్లు, యూనియన్​ లీడర్లు, అధికారులు, సెంటర్ల నిర్వాహకులు కలిసి పంచుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలను అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలను ప్రక్షాళన చేసినట్లు తెలిపారు.