
- సింగిల్ ఛార్జింగ్‌పై 300 కి.మీల కంటే ఎక్కువ దూరం వెళ్లొచ్చు
- ఆకర్షిస్తున్న సిత్రియాన్ ఈసీ3
- టాటా మోటార్స్ నుంచే ఎక్కువ మోడల్స్
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగవుతోంది. కంపెనీలు కరెంట్ బండ్లను తీసుకురావడానికి భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కిందటేడాది అమ్ముడైన 15.3 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఫోర్ వీలర్ల వాటా 5 శాతంగా ఉంది. అంటే 72,623 బండ్లు సేల్ అయ్యాయి. టాటా మోటార్స్ 51,189 ఎలక్ట్రిక్ కార్లను అమ్మగలిగింది.
ఎంజీ మోటార్స్ (9,263), మహీంద్రా (4,140), బీవైడీ (1,774), హ్యుండాయ్ (1,577) ఈవీ సేల్స్ కూడా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పెరిగాయి. కంపెనీలు వివిధ మోడల్స్‌తో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఫుల్ ఛార్జ్‌పై 500 కి.మీ వరకు ప్రయాణించగలిగే మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్నింటి ధరలు రూ.15 లక్షల లోపు ఉన్నాయి. ఇలాంటి కార్లలో టాప్ 5 గురించి తెలుసుకుందాం.
టాటా టిగోర్ ఈవీ..
అందుబాటు ధరల్లో టాటా మోటార్స్ నుంచి వచ్చిన మరో ఎలక్ట్రిక్ మోడల్ టాటా టిగోర్ ఈవీ. ఈ కారు ధర రూ. 12.49 లక్షల నుంచి స్టార్ట్ అవుతోంది. మొత్తం నాలుగు వేరియంట్లు మూడు కలర్స్‌లో టాటా టిగోర్ ఈవీ అందుబాటులో ఉంది. ఫుల్ ఛార్జింగ్‌పై 315 కి.మీ వెళ్లగలదు. ఈ కారులో 26 కిలోవాట్స్‌అవర్ కెపాసిటీ బ్యాటరీని అమర్చారు.
సిత్రియాన్ ఈసీ3
కిందటేడాది లాంచ్ అయిన సిత్రియాన్ ఈసీ3 సింగిల్ ఛార్జింగ్‌పై 320 కి.మీ వరకు ప్రయాణించగలుగుతోంది. ఈ కారు ధర రూ. 12.69 లక్షల నుంచి రూ. 14 లక్షల మధ్య ఉంది. మొత్తం 13 కలర్ కాంబినేషన్స్‌లో ఈ బండి అందుబాటులో ఉంది. 57 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ కెపాసిటీ 29.2 కిలోవాట్స్‌అవర్.
టాటా టియాగో ఈవీ..
టియాగో మోడల్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన టాటా టియాగో ఈవీ సింగిల్ ఛార్జింగ్‌పై 310 కి.మీ రేంజ్ ఆఫర్ చేస్తోంది. ఇది టాటా మోటార్స్ తీసుకొచ్చిన మొదటి హ్యాచ్‌బ్యాక్. ఈ కారు మొత్తం ఏడు వేరియంట్లలో ఐదు కలర్స్‌లో అందుబాటులో ఉంది. ధర రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఉంది. ఇండియాలో అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో టాటా టియాగో ధరనే తక్కువ. ఈ కారులో 24 కిలోవాట్స్‌అవర్ బ్యాటరీని అమర్చారు.
టాటా పంచ్ ఈవీ..
టాటా మోటార్స్ మార్కెట్‌లోకి తెచ్చిన ఎలక్ట్రిక్ మోడల్ టాటా పంచ్ ఈవీ. ఈ కారు సింగిల్ ఛార్జింగ్‌పై 315 కి.మీల నుంచి 421 కి.మీల వరకు రేంజ్‌ను ఆఫర్ చేస్తోంది. మూడు వేరియంట్లలో ఈ బండి అందుబాటులో ఉంది. ధర రూ.11 లక్షల నుంచి మొదలవుతోంది. బ్యాటరీ కెపాసిటీ 35 కిలోవాట్స్‌అవర్.
టాటా నెక్సాన్ ఈవీ
పాపులర్ మోడల్ టాటా నెక్సాన్ ఈవీ కస్టమర్లను ఆకర్షిస్తోంది. వేరియంట్‌ను బట్టి ఈ కారు ఫుల్ ఛార్జింగ్‌పై 325 కి.మీల నుంచి 465 కి.మీ వరకు రేంజ్ ఆఫర్ చేస్తోంది. ఈ మోడల్‌లో బేస్ వేరియంట్ ధర రూ. 14.49 లక్షల నుంచి మొదలవుతోంది. ఈ ఎలక్ట్రిక్ కారు మొత్తం 10 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఫాస్ట్ ఛార్జ్‌తో 56 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ సైజ్ 40.5 కిలోవాట్స్‌అవర్.