హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డీల్ అయిన 80 బిలియన్ డాలర్ల నెట్‌ఫ్లిక్స్-వార్నర్ బ్రదర్స్ ఒప్పందం కుప్పకూలింది. అనూహ్య పరిణామాల మధ్య పారామౌంట్ గ్లోబల్ ఈ రేసులో విజేతగా నిలిచింది. అయితే ఈ బిజినెస్ డీల్ వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలు చూస్తుంటే.. అసలైన విజేత డొనాల్డ్ ట్రంప్ అనే చర్చ మొదలైంది. ఈ మెగా స్టూడియో వార్‌లో అసలు ఏం జరిగింది.. చివరి నిమిషంలో జరిగిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
నెట్‌ఫ్లిక్స్ వెనకడుగు..
వార్నర్ బ్రదర్స్‌ను దక్కించుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. పారామౌంట్ తన ఆఫర్‌ను ఒక్కో షేరుకు 31 డాలర్ల క్యాష్ పేమెంట్ కి పెంచడమే కాకుండా, ఒకవేళ డీల్ రద్దయితే చెల్లించాల్సిన బ్రేక్-అప్ ఫీజు బాధ్యతను కూడా తీసుకుంది. దీంతో వార్నర్ బ్రదర్స్ బోర్డు పారామౌంట్ వైపే మొగ్గు చూపింది. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడికే ప్రాధాన్యత ఇస్తామని చెబుతూ నెట్‌ఫ్లిక్స్ ఈ రేసు నుంచి తప్పుకుంది.
ట్రంప్ ప్లాన్ వర్కవుట్ అయిందా?
ఈ డీల్‌లో రాజకీయ కోణం చాలా బలంగా ఉంది. ట్రంప్‌కు పారామౌంట్ వెనుక ఉన్న టెక్ బిలియనీర్ లారీ ఎల్లిసన్ అత్యంత సన్నిహితుడు. పైగా ట్రంప్ ఎన్నికల ప్రచారానికి భారీ విరాళాలు ఇచ్చిన వ్యక్తి కూడా. పారామౌంట్ బాధ్యతలు లారీ ఎల్లిసన్ కుమారుడు డేవిడ్ ఎల్లిసన్ చూస్తున్నారు. ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా మొదట్లో ఈ డీల్ కోసం ప్రయత్నించారు. అయితే మెుత్తానికి చివరి నిమిషయంలో జరిగిన మార్పులు నెట్‌ఫ్లిక్స్ రేసు నుంచి తప్పుకునేలా చేశాయి.
టార్గెట్ CNN: ప్రతీకారం తీర్చుకున్నారా?
ట్రంప్‌కు.. వార్నర్ బ్రదర్స్ యాజమాన్యంలోని CNN ఛానల్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అవినీతిపరులు నడుపుతున్న CNNను అమ్మేయాలని ట్రంప్ గతంలోనే బహిరంగంగా చెప్పారు. ఇప్పుడు పారామౌంట్ చేతికి వార్నర్ బ్రదర్స్ వెళ్లడంతో.. HBO Max, ఫుడ్ నెట్‌వర్క్‌తో పాటు CNN కూడా ట్రంప్ మిత్రుల నియంత్రణలోకి వెళ్లనుంది. దీనివల్ల ఆ ఛానల్ ఎడిటోరియల్ విధానం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఇది ట్రంప్ కి కలిసొచ్చే అంశమే.
16 మినిట్స్ వివాదం.. సెటిల్మెంట్
మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. కమలా హారిస్ ఇంటర్వ్యూ ఎడిటింగ్ విషయంలో ట్రంప్ వేసిన కేసులో పారామౌంట్ CBS న్యూస్ తరపున 16 మిలియన్ డాలర్ల సెటిల్‌మెంట్‌కు అంగీకరించింది. ఇది జరిగిన కొద్ది రోజులకే వార్నర్ బ్రదర్స్ డీల్‌లో పారామౌంట్‌కు లైన్ క్లియర్ అవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఒకవేళ రెగ్యులేటరీ సంస్థలు ఈ విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. పారామౌంట్ చేతిలో CBS, నికెలోడియన్, వార్నర్ బ్రదర్స్ లైబ్రరీ, CNN వంటి టాప్ మీడియా ఆస్తులు ఉంటాయి. మొత్తానికి నెట్‌ఫ్లిక్స్‌ను పక్కకు నెట్టి.. తనకు అనుకూలమైన వ్యక్తుల చేతికి మీడియా సామ్రాజ్యం వెళ్లేలా చేయడంలో ట్రంప్ సఫలమయ్యారని విశ్లేషకులు అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతనే విషయాన్ని పక్కన పెడితే ఇందులో నిజమైన విజేత మాత్రం అధ్యక్షుడు ట్రంప్ అనే చెప్పుకోవాలి.
