40 ఏళ్లలో ఇదే మొదటిసారి.. జులైలో 39.7 సెం.మీ

 40 ఏళ్లలో ఇదే మొదటిసారి.. జులైలో 39.7 సెం.మీ

నెట్ వర్క్, వెలుగు: రాష్ట్రంలో నెల రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. అల్పపీడనాలు, ఉపరితల ద్రోణులతో వర్షాలు ఆగకుండా పడుతూనే ఉన్నాయి. గత నెల 7 నుంచి భారీగా వర్షపాతం నమోదవుతోంది. గత 40 ఏళ్లలో ఈ స్థాయి వానలు ఎప్పుడూ కురవలేదని వాతావరణ శాఖ చెబుతోంది. అల్పపీడనం, వాయుగుండం టైమ్​లో కొద్ది రోజులు వానలు రావడం, తిరిగి సాధారణ స్థితి ఏర్పడడం ప్రతి సీజన్​లో జరిగేదే. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో నదులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో బాధితులు నిలువ నీడలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వరదల సమయంలో పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నా ఇప్పుడు వాటిని ఎత్తేయడంతో ఎక్కడుండాలో తెలియక అవస్థలు పడుతున్నారు. చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లోని గ్రామాలు బురదమయంగా మారాయి. 

గత నెల 7 నుంచే మొదలు 

నైరుతి రుతుపవనాల రాకతో జూన్​లో వర్షాలు మొదలవుతాయి. ఈ జూన్​లో రుతుపవనాల ప్రభావంతో మోస్తరు వర్షపాతమే నమోదైంది. కానీ జులై నుంచి వానలు ప్రతాపం చూపిస్తున్నాయి. గత నెల 7వ తేదీ నుంచి ఊహించని విధంగా వర్షపాతాలు నమోదవుతున్నాయి. గత నెల 10న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం, మహదేవ్ పూర్ లో 34.7 సెం.మీ. చొప్పున, కాటారంలో 34.3 సెం.మీ. వర్షం పడింది. అలాగే  9న ముథోల్ లో 20.3 సెం.మీ., భైంసాలో 16.8,  సెం.మీ వాన కురిసింది. 13న కరీంనగర్ జిల్లా గుండిలో 17.8, ఆర్నకొండలో 17.1,  కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో 39.7 సెం.మీ. వర్షం కురిసింది. రాష్ట్ర ంలో గత 40 ఏళ్లలో ఈ స్థాయి వర్షపాతాలు నమోదు కావడం ఇదే మొదటి సారని వాతావరణ శాఖ చెబుతున్నది. 1983 అక్టోబర్​6న నిజామాబాద్​ వాతావరణ శాఖ అబ్జర్వేటరీ పరిధిలో 35.5 సెంటీమీటర్లవాన కురిసింది. అలాగే 1908లో సెప్టెంబర్​28న హన్మకొండ అబ్జర్వేటరీ పరిధిలో 30.4 సెంటీమీటర్ల వర్షం పడింది.

గోడ ​కూలి ఇద్దరి మృతి

రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వేర్వేరు చోట్ల ఇద్దరు చనిపోయారు. ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తమల్లూరు గ్రామంలో పెంకుటిల్లు కూలి సోయం మంగమ్మ (62) ఆదివారం రాత్రి చనిపోయింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో కాంపౌండ్​గోడ కూలి వెంకటేశ్వర్లు (60) అనే వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. వానలకు సింగరేణి ఓపెన్ కాస్ట్​ గనుల్లో సోమవారం బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో 12.6  సెం.మీ., కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్​మండలంలో 10.1 సెంటీమీటర్ల  వర్షపాతం నమోదైంది. మహబూబ్​నగర్​జిల్లా నవాబుపేట మండలంలో యన్మన్​చెరువుకు గండిపడి రుక్కంపల్లి, చెన్నారెడ్డిపల్లి, ఇప్పటూరు, గోవన్​పల్లి గ్రామాల పరిధిలో దాదాపు 300 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. వరదలో ఒక ఆవు గల్లంతయింది.