నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించను : రంజిత్​రెడ్డి

నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించను : రంజిత్​రెడ్డి
  • దమ్ముంటే కొండా విశ్వేశ్వర్​రెడ్డి చేస్తున్న ఆరోపణలను నిరూపించాలి
  • చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్​రెడ్డి

చేవెళ్ల, వెలుగు : కొండా విశ్వేశ్వర్​రెడ్డి రుజువులు లేకుండా తనపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్​రెడ్డి హెచ్చరించారు. దమ్ముంటే ఆరోపణలను నిరూపించాలని, విశ్వేశ్వర్​రెడ్డితో చర్చకు సిద్ధమని సవాల్​విసిరారు. గురువారం రాత్రి రంజిత్​రెడ్డి చేవెళ్లలోని షాబాద్​ చౌరస్తా నుంచి మహానీయుల చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్​మీటింగులో పాల్గొని మాట్లాడారు.

ఎన్నికల్లో పోటీ పడాలని కానీ.. ఎదుటివాళ్లపై బురద జల్లకూడదన్నారు. విశ్వేశ్వర్​రెడ్డి అపోలో హాస్పిటల్​లో ఎంత మందికి డిస్కౌంట్లు ఇచ్చారని ప్రశ్నించారు.  కరోనా టైంలో చేవెళ్ల ప్రజలను పట్టించుకున్న పాపనపోలేదని, భార్య, పిల్లలు వద్దన్నారని ఇంటికే పరిమితమైన ఆయన తనపై అసత్య ఆరోపణలు చేయడం కరెక్ట్​కాదన్నారు. తానెవరో తెలియని సమయంలో చేవెళ్ల ప్రజలు ఎంపీగా గెలిపించారని, గుండెల్లో పెట్టుకున్నారన్నారు. సొంత నిధులతో చేవెళ్ల బస్​స్టేషన్​విస్తరణ పనులు చేయించానని, మినీ స్టేడియం నిర్మించానని చెప్పారు.

చేవెళ్ల– హైదరాబాద్​హైవే నిర్మాణానికి నిధులు తీసుకొచ్చానని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం యువతను మభ్యపెట్టి పబ్బం గడుపుతోందన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గ ఇన్​చార్జ్​పామెన భీం భరత్, కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ మెంబర్​మాలతి కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకట్​రెడ్డి, గోనే ప్రతాప్​రెడ్డి, ఎంపీటీసీలు వసంతం, గుండాల రాములు, నాయకులు శైలజ, రాంరెడ్డి, హన్మంత్​రెడ్డి, నర్సింహులు, వీరేందర్​రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

300 మంది కాంగ్రెస్​లో చేరిక

తాండూరు : బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్​రెడ్డి కోరారు. గురువారం తాండూరులోని వివిధ పార్టీలకు చెందిన 300 మంది నాయకులు, కార్యకర్తలు రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.అంతకు ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దేముల్, మంబాపూర్, కందనెల్లి గ్రామాల్లో రంజిత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.