ఎర్రకోట వద్ద పేలుడు కేసు.. 7,500 పేజీల చార్జిషీటు ఫైల్

ఎర్రకోట వద్ద పేలుడు కేసు.. 7,500 పేజీల చార్జిషీటు ఫైల్
  • ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో దాఖలు చేసిన ఎన్ఐఏ

న్యూఢిల్లీ: నిరుడు నవంబరు 10న దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో జాతీయ  దర్యాప్తు సంస్థ (ఎన్ఏఐ) 7,500 పేజీలతో చార్జిషీటు దాఖలు చేసింది. గురువారం ఢిల్లీలో పటియాలా హౌస్  కోర్ట్స్ లోని ఎన్ఐఏ స్పెషల్  కోర్టులో ఈ చార్జిషీటు ఫైల్  చేసింది. 10 మంది నిందితుల పేర్లను చార్జిషీటులో చేర్చారు.

 వారంతా అల్ కాయిదాకు చెందిన అనుబంధ సంస్థ అన్సర్  ఘజ్వాతుల్ హింద్ (ఏజీయూహెచ్) తో సంబంధం ఉన్నవారని అధికారులు తెలిపారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత ఓ న్యూస్ చానెల్​తో ఎన్ఐఏ అధికారి ఒకరు మాట్లాడారు. ‘‘బీఎన్ఎస్​లో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంతో పాటు పేలుడు పదార్థాల కేసు, ఆయుధాల చట్టం, పబ్లిక్  ప్రాపర్టీకి నష్టాన్ని నివారించే చట్టం కింద చార్జిషీటు సబ్మిట్  చేశాం. 

ఈ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్  ఉమర్  ఉన్ నబీ చనిపోయాడు. డీఎన్ఏ ఫింగర్ ప్రింట్ ద్వారా అతడిని గుర్తించాం. అతను ఫరీదాబాద్​లోని అల్ ఫలాహ్ వర్సిటీలో మాజీ అసిస్టెంట్  ప్రొఫెసర్​గా పనిచేశాడు. ఇక మిగిలిన తొమ్మిది మంది ఆమిర్  రషీద్  మిర్, జసీర్  బిలాల్  వనీ, డాక్టర్  ముజమిల్  షకీల్, డాక్టర్  ఆదిల్  అహ్మద్  రథర్, డాక్టర్  షహీన్  సయీద్, ముఫ్తీ ఇర్ఫాన్  అహ్మద్ వాగే, షోయబ్, డాక్టర్  బిలాల్ నసీర్  మల్ల, యాసిర్  అహ్మద్  దార్” అని ఆ అధికారి వివరించారు.

 నిందితులంతా అల్ కాయిదా టెర్రర్  సంస్థ భావజాలంతో స్ఫూర్తి పొందారని తెలిపారు. నిందితుల్లో డాక్టర్లను కూడా ర్యాడికలైజ్  చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. వారంతా ఏజీయూహెచ్ నెట్ వర్క్​లో భాగంగా పనిచేశారని వెల్లడించారు.