మద్యం షాపుల టెండర్లకు షెడ్యూల్‌ విడుదల 

మద్యం షాపుల టెండర్లకు షెడ్యూల్‌ విడుదల 

తెలంగాణ ప్ర‌భుత్వం మద్యం దుకాణాల టెండర్లకు షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 10 నుంచి 18 వరకు మద్యం దుకాణాలకు టెండర్లు వేయదలచిన వారు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. నాన్‌ రిఫండబుల్‌ అమౌంట్‌గా రూ.2 లక్షలు చెల్లించాల‌ని నిర్ణయించింది. మద్యం షాపుల లాటరీని ఈ నెల 20వ తేదీన తీయనున్నట్లు చెప్పింది. గత 2019 నిర్వహించిన లాటరీలో మద్యం షాపులు వచ్చినవారి గడువు అక్టోబర్‌తో ముగిసింది. కరోనా, లాక్‌ డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలకు ఒక నెల రోజులు గడువు పొడిగించింది.

అక్టోబర్ నెలలోనే 2019-21 ఎక్సైజ్ పాలసీ ముగిసింది. అయితే కరోనా కారణంగా, లాక్ డౌన్ రావడంతో ఈ ఏడాది మరో నెల మద్యం షాపుల గడువు పొడగించారు. అయితే తాజాగా 2021-23 మద్యం షాపులకు టెండర్ల షెడ్యూల్ ను ప్రకటించారు.  ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2216 మద్యం షాపులు ఉన్నాయి. కొత్తగా మరో 10 శాతం మద్యం దుకాణాలను పెంచనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు ఉంటాయని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, గౌడలకు 15 శాతం కేటాయించనుంది.