క్లాక్ రూమ్స్ గా టులెట్ పోర్షన్లు

క్లాక్ రూమ్స్ గా టులెట్ పోర్షన్లు
  • కరోనా క్రైసిస్లో సరికొత్త ఆలోచన
  • ఖాళీ పోర్షన్లను క్లాక్ రూములుగా మారుస్తున్న ఓనర్లు
  •  అదే బాటలో హాస్టళ్లు, గోడౌన్లు

కరోనా కారణంగా సిటీ వదిలి వెళ్లిన వారితో చాలా ఇండ్లు ఖాళీగా అయ్యాయి. అప్పటి దాకా రెంటల్ ఇన్కమ్ పొందిన ఓనర్లకు ఆదాయం పడిపోయింది. కొద్దిరోజులు టు లెట్ బోర్డులు వేలాడదీసినా ఫలితం లేకపోవడంతో క్లాక్ రూమ్స్ గా మారుస్తున్నారు. లగేజీని సొంతూళ్లకు తీసుకెళ్లలేక , ఉన్న ఇంటికి ఎక్కువ రెంట్ చెల్లించలేక ఇబ్బంది పడు తున్నవాళ్లుతమ సామాన్లను వీటిల్లోకి షిప్ట్ చేస్తున్నారు. రెంట్ 70శాతం తక్కువకే దొరుకుతుండటంతో ఎక్కువ మంది ఇంట్రెస్టు చూపుతున్నారు. లాక్ డౌన్ తో ఖాళీ అయిన హాస్టళ్లు, గోడౌన్లు , కూలీల్లేని క్యాంపులు కూడా క్లాక్ రూమ్స్ గా మారుతున్నాయి.

 భారం తగ్గించుకుంటున్నరు

ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి సిటీలో ఉంటున్నవాళ్లే ఎక్కువ మంది. లాక్ డౌన్ తో పనుల్లేక సొంతూళ్ళకు వెళ్పిపోయారు. ఇంకొందరు వర్క్ ఫ్రం హోమ్ తో ఊళ్ళలోనే ఉండిపోయారు. ప్రతి నెల వేలల్లో రెంట్ పేచేయడం కష్టంగా మారడంతో క్లాక్ రూమ్స్ ను ఆశ్రయిస్తున్నారు. దిల్ సుఖ్ నగర్ లో ఉండే ఓ వ్యక్తి బండిపై స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తుంటాడు. లాక్ డౌరం తో సొంతూరు కెళ్లాడు. బండి, సామాను రోడ్డుపై ఉంచలేక దగ్గరల్లో ఖాళీగా ఉన్న షెట్టర్లో ఉంచి, నెలకు 2వేలు చెల్లిస్తున్నాడు. నాలుగు నెలలుగా ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నాడని యజమాని సుగుణాకర్ తెలిపారు. మియాపూర్లో ఉండే ఐటీ ఎంప్లాయిస్ శాంతి ప్రియ దంపతులకి వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడంతో ఊరికి వెళ్లారు. కొద్ది రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకుని సిటీలో అద్దె ఇల్లు ఖాళీ చేసి, సామాన్లను పక్కనే ఖాళీగా ఉన్న రెండు స్టోర్ రూమ్స్ లో  ఉంచి నెలకు రూ.1,800 చెల్లిస్తున్నారు. వారికి 10వేలకి పైగా భారం తగ్గింది. ప్రైవేట్ హాస్టల్స్ కొంత ఊరట సిటీలో వందల సంఖ్యలో ఉన్న స్టూడెంట్, వర్కింగ్ మెన్, విమెన్ హాస్ట ల్స్ కరోనా ఎఫెక్ట్ తో ఖాళీ అయ్యాయి. దాంతో కొందరు నిర్వాహకులు హాస్టళ్లను క్లాక్ రూమ్స్ గా మార్చి ఇన్కం పొందుతున్నారు. మళ్లీ సిటీకి రావాలనుకున్న వాళ్లు ఈ ఫెసిలిటీ యూజ్ చేసుకుంటున్నారు. స్టూడెంట్స్ ఎక్కువగా ఉండే అమీర్ పేట్, దిల్ సుఖ్ నగర్ , కాచిగూడ వంటి ఏరియాల్లోఈ బిజినెస్ బాగా నడుస్తోంది. నిర్వా హకులు నెలకి రూ. 500 నుంచి రూ.వెయ్యి దాకా తీసుకుంటున్నారు.

భారీ సామగ్రికి గోడౌన్లు

ఎప్పుడూ వస్తుసామగ్రితో ఫుల్ గా ఉండే గోడౌన్లు ఇప్పుడు బిజినెస్ లేక ఖాళీగా మారాయి. దాంతో సినిమా, ఫంక్షన్ హాల్స్ సెట్టింగ్, టెంట్ హౌస్, కన్ స్ట్రక్షన్ సామగ్రిని భద్రపరిచేందుకు కొందరు గోడౌన్లను ఆశ్రయిస్తున్నారు. శివారుల్లోని సుచిత్ర, బోడుప్పల్, హయత్ నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, పటాన్ చెరు, శామీర్ పేట్ వంటి ఏరియాల్లో కొన్ని గోడౌన్లు క్లాక్ రూమ్స్ గా మారాయి. భారీగా ఉండే సామగ్రిని ఉంచితే ప్రతి నెల రూ. 50 వేల నుంచి 70వేల దాకా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఖాళీ గో డౌన్లకు షిఫ్ట్ చేయడం వల్ల రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా తీసుకుంటున్నామని బాలాపూర్ కు చెందిన రవిశంకర్ తెలిపారు.

సామాను హాస్టల్లోనే..

సిటీలో ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతున్నా. లాక్ డౌన్ తో ఇంటికి వచ్చాను. నా వస్తువులు హాస్టల్లోనే ఉండడంతో మొదట్లో మొత్తం బిల్లుపే చేయాలని అడిగారు. ఆ తర్వాత వస్తువులను ఉంచినందుకు రూ. 750 మాత్రమే తీసుకుంటున్నారు.     ‑ విశ్వనాథ్, స్టూడెంట్

లక్షల అద్దె నుంచి రిలీఫ్

సినిమాలు, ఈవెంట్లకు సెట్టింగ్ సామగ్రి సప్లయ్ చేస్తుంటా. ఒక ఈవెంట్ నుంచి ఇంకో ఈవెంట్ కు నేరుగా కూలీలతో తరలించేవాళ్లం. ఒక్కోసారి అదే ఫంక్షన్ హాల్లో ఓ మూలన ఉంచేవాళ్లం. కరోనా ఎఫెక్ట్ తో పనుల్లేక 100 మంది దాకా కూలీలు సొంతూళ్ళకు  వెళ్లిపోయారు. మెటీరియల్ ఉంచేందుకు లక్షల్లో రెంట్ చెల్లించలేక మా పక్కనే ఖాళీగా ఉన్నగోడౌన్ ను క్లాక్ రూమ్ గా మార్చుకుని రూ. 30వేలు చెల్లిస్తున్నా.   – సుధాకర్ రెడ్డి, మెటీరియల్ సప్లయర్