తెలంగాణపై ఫుల్ ఫోకస్.. ప్రచారంలో స్పీడ్​ పెంచిన బీజేపీ, కాంగ్రెస్​

తెలంగాణపై ఫుల్ ఫోకస్.. ప్రచారంలో స్పీడ్​ పెంచిన బీజేపీ, కాంగ్రెస్​
  • నేటి నుంచి మోదీ, రాహుల్, ప్రియాంక పర్యటనలు
  • కాంగ్రెస్​ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, 
  • ఇన్​చార్జిలతో కేసీ వేణుగోపాల్ రివ్యూ
  • బీజేపీ ఎన్నికల కమిటీతో బీఎల్​ సంతోష్​ భేటీ 

హైదరాబాద్, వెలుగు: దేశంలో లోక్​సభ మూడో విడత ఎన్నికల పోలింగ్ ముగియడంతో రెండు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తెలంగాణపై ఫుల్​ ఫోకస్​ పెట్టాయి. ఈ నెల11తో తెలంగాణలో ప్రచారం ముగియనుండగా.. ఈ రెండు పార్టీలు తమ ఎలక్షన్​ క్యాంపెయిన్​ను మరింత స్పీడప్ చేశాయి. ప్రధాని మోదీ మరో విడత ప్రచారం కోసం మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం రాష్ట్రంలో ఆయన బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం   ప్రచారం కొనసాగించనున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ ఈ నెల 10, 11వ  తేదీల్లో రాష్ట్రంలో ప్రచారం నిర్వహించనున్నారు. 

రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం 

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్నది. దీంతో చివరి రోజుల్లో ప్రచారాన్ని ఎలా కొనసాగించాలి? జనానికి ఎలా చేరువ కావాలి? ప్రత్యర్థి పార్టీల కన్నా పైచేయి సాధించడం ఎలా? అనే దానితో పాటు పోలింగ్ సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే దానిపై  బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలకు మంగళవారం దిశానిర్దేశం చేశారు.

బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర బీజేపీ ఎలక్షన్ మేనేజ్​మెంట్​ కమిటీతో  ఆ పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సమావేశమయ్యారు. పార్టీ నేతలకు ఇటు ప్రచారం, అటు పోలింగ్ పై సూచనలు చేశారు. 4 రోజులు జాగ్రత్తగా ఉండాలని, ప్రతి గంట అబ్జర్వేషన్ చేయాలని దిశా నిర్దేశం చేశారు. రిజర్వేషన్లపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని ఆదేశించారు. కుల రిజర్వేషన్లకు మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకమనే అంశాన్ని ప్రజల్లోకి ఆధారాలతో సహా తీసుకుపోవాలని సూచించారు. పదేండ్ల మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీతోపాటు అమిత్ షా, నడ్డా, పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యనేతలూ ప్రచారంలో  పాల్గొనేందుకు అటెండ్ అవుతారని చెప్పారు. వారిని అవసరాలకు అనుగుణంగా సెగ్మెంట్లలో ప్రచారానికి ఉపయోగించుకోవాలని సూచించారు. 

కాంగ్రెస్​ నేతలతో కేసీ వేణుగోపాల్​ భేటీ 

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా లోక్ సభ నియోజకవర్గాలవారీగా కాంగ్రెస్ అభ్యర్థులు, ఇన్​చార్జిలు, ఎమ్మెల్యేలతో జూమ్ లో భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారం తీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందనపై ఆరా తీశారు. ఈ చివరి రోజుల్లో ప్రచారాన్ని మరింత స్పీడప్ చేయాలని దిశానిర్దేశం చేశారు. బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ జనంలో కాంగ్రెస్ కు సానుకూల వాతావరణం ఏర్పడేలా ప్రచారం సాగించాలని సూచించారు. కొన్ని నియోజకవర్గాల్లో అనుకున్న స్థాయిలో ప్రచారం సాగకపోవడం, మరికొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య సరైన సమన్వయం లేకపోవడంపై కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. మిషన్15 టార్గెట్ సాధించాలని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడంలో తెలంగాణ కీలకంగా నిలువాలని కోరినట్టు సమాచారం.

9న రాహుల్ రాక 

చివరి విడత ప్రచారం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 9న రాష్ట్రానికి వస్తున్నారు. ఉదయం మెదక్ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్ సభలో, అదేరోజు సాయంత్రం చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోకి వచ్చే సిటీ శివారు ప్రాంతం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగనున్న సభలో ఆయన పాల్గొంటారు.  ఈ నెల10న ప్రియాంకగాంధీ కామారెడ్డి, తాండూర్ సభల్లో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం కూకట్ పల్లి, మణికొండ రోడ్ షోలో పాల్గొననున్నారు.  ప్రచారానికి చివరి రోజైన ఈ నెల11 న ఉదయం సీఎం రేవంత్ రెడ్డి  పటాన్ చెరు కార్నర్ మీటింగ్ లో, సాయంత్రం మహబూబ్ నగర్  పార్లమెంట్ పరిధిలోని మక్తల్ సభలో పాల్గొంటారు. ఈ నియోజకవర్గం నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రేవంత్.. ఇదే నియోజకవర్గంతో  ప్రచారాన్ని ముగించనున్నారు.