ఇటు కృష్ణా.. అటు మూసీ.. ఎన్నికల అంశం​గా మారుతున్న నదుల సమస్య

ఇటు కృష్ణా.. అటు మూసీ.. ఎన్నికల అంశం​గా మారుతున్న నదుల సమస్య
  •     రూ.50 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామంటున్న కాంగ్రెస్ 
  •     కృష్ణా నదిలో వాటా సంగతి తేలుస్తామంటున్న బీఆర్ఎస్ 
  •     యువతకు ఉపాధిపై బీజేపీ ఫోకస్  

నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కృష్ణా, మూసీ నదులు ఎన్నికల అంశంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రకటిస్తున్న హామీల్లో ప్రధానంగా కృష్ణా, మూసీ నదుల సమస్యల గురించే పార్లమెంట్​లో గళం విప్పుతామని చెబుతున్నారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటా సంగతి తేలుస్తామని బీఆర్ఎస్ చెప్తుంటే, రూ.50 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు కృషి చేస్తామని బీజేపీ అంటోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని స్పీడప్ చేశారు. పార్టీ సీనియర్లు సైతం మండుంటెండ్లల్లో అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. 

కృష్ణా జలాలపై మాటల యుద్ధం..

కృష్ణా జలాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే కృష్ణా జలాల్లో నీటి పంపకాల వ్యవహారాన్ని కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డుకు అప్పగించి నల్గొం డ జిల్లాకు తీరని అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. తమ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపిస్తే నీటి వాటా సంగతి తేలుస్తామని, రాష్ట్రానికి దక్కాల్సిన వాటా గురించి పార్లమెంట్​లో పోరాడుతామని బీఆర్ఎస్​నాయకులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే పదేండ్ల నుంచి బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిన శ్రీశైల సొరంగ మార్గం, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు, ఏఎమ్మార్పీ లైనింగ్ పనులు కంప్లీట్ చేస్తామని ఎన్నికల ఇన్​చార్జి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. 

పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు..

భువనగిరిలో బీజేపీని గెలిపిస్తే యువతకు ఉపాధి కల్పించేందుకు జాతీయ రహదారి వెంబడి పారిశ్రామిక కారిడార్ నెలకొల్పేందుకు కృషి చేస్తానని ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ హామీ ఇస్తున్నారు. అంతేగాక ఎన్​హెచ్ 65 హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు హైస్పీడ్ రైల్వే లైన్ నిర్మా ణానికి కృషి చేస్తానని, చిట్యాలలో డ్రై పోర్టు ఏర్పాటు చేస్తానని ప్రచారం చేస్తున్నారు. ఏయిమ్స్, నిమ్స్ ఆసుపత్రుల పనులు కంప్లీట్ చేయడంతోపాటు రాచకొండ కొండలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని బూర ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. 

మూసీ ప్రక్షాళనే ప్రధాన ఏజెండా..

భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే మూసీ ప్రక్షాళన చేస్తామని కోమటిరెడ్డి బ్రదర్స్ చెపుతున్నారు. రూ.50 వేల కోట్లతో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రక్షాళన కోసం అవసరమయ్యే నిధుల సమీకరణకు వివిధ బ్యాంకులతో చర్చలు జరుపుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు.

భువనగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలో దాదాపు 150 కిలో మీటర్ల మేర ప్రవహించే మూసీ నది చివరకు కృష్ణా నదిలో కలుస్తుంది. దీని పరిధిలో సుమారు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఫార్మా కంపెనీల నుంచి వచ్చే రసాయనాలతో మూసీ నది కలుషితమవుతోంది. దీంతో భువనగిరి పార్లమెంట్ పరిధిలోని దాదాపు కోటి మంది వివిధ రకాల రోగాలబారిన పడుతున్నారు. మూసీ నది ప్రక్షాళన చేయడమేగాక, దాని పరిధిలోని పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల నిర్మాణం పనులు కూడా పూర్తి చేస్తామని, తద్వారా చివరి భూములకు కూడా సాగునీరు అందుతుంద ని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రజలకు వివరిస్తున్నారు. అంతేగాక బస్వాపురం రిజర్వాయర్ కంప్లీట్ చేసి, గోదావరి జలాలను చౌటుప్పుల్ వరకు తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు.