బ్రిటిష్ ప్రభుత్వ తీరును తిరస్కరించి తిరుగుబాటు చేసిన మహోద్యమకారుడు వినాయక్దామోదర్ సావర్కర్. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కొదమసింహాల్లా పోరాడిన వారందరిలో వీరసావర్కర్ పోరాటపటిమ అగ్రస్థానంలో ఉంటుంది. అలాంటి సావర్కర్ భారత జాతి సంపద. కానీ,
సావర్కర్ త్యాగాన్ని చిన్నదిగా చేసి చూపడం, ఆయన గౌరవాన్ని తగ్గించేందుకు నేడు కొంతమంది పోటీ పడుతున్నారు. సావర్కర్ విప్లవానికి ప్రేరణ. ప్రతి భారతీయుడికి స్వాభిమానం, ఆయన త్యాగం, చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం. ధైర్యానికి నిలువెత్తు సాక్ష్యం!
తల్లి భారతి వైభవం కోసం కాలాపాని జైలులో కాళరాత్రులు గడిపిన స్ఫూర్తి ప్రదాత. స్వాభిమానం, స్వావలంబనలో జాతి వైభవానికి వెలుగు రేఖ సావర్కర్. అలాంటి మహనీయుడికి భారతరత్న అవార్డు ఇవ్వడం సముచితం. ఫిబ్రవరి 26వ తేదీన వీర సావర్కర్ వర్ధంతి సందర్భంగా భారత ప్రభుత్వం వారికి భారతరత్న అవార్డును ప్రదానం చేసి, సావర్కర్ చరిత్ర నేటి సమాజానికి అందుబాటులోకి తీసుకురావడం అవసరం.
లేఖల సారాంశం వక్రీకరణ
అండమాన్ సెల్యులర్‌లో స్వాతంత్ర్య ఉద్యమ వీరులకు విధిస్తున్న అమానుష శిక్షలు, చిత్రహింసలను ఖండిస్తూ బ్రిటిష్ పాలకులకు వీరసావర్కర్ లేఖలు రాసినది వాస్తవం. చేయని నేరానికి రాక్షసుల కంటే ఘోరమైన రీతిలో హింసించడం నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిక్షలు అనుభవించలేక, చిత్రహింసలు భరించలేక చాలామంది ఉద్యమకారులు చనిపోయారు. మరి కొంతమంది పిచ్చివాళ్లుగా తయారయ్యారు. వాటన్నింటిని చూసి చలించిన సావర్కర్.. ఆంగ్లేయులకు లేఖలు రాశారు.
‘విప్లవకారుడు బతికి ఉంటేనే పోరాటం కొనసాగుతుంది. చనిపోయిన వీరుడు ఆదర్శం అవుతాడు. కానీ, బతికి ఉన్న వీరుడే యుద్ధానికి నేతృత్వం వహిస్తాడు’ అని చెప్పారు. అండమాన్ జైలులోకి వెళ్లేటప్పుడు ఖైదీలు ఒక పత్రం పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఒకవేళ అక్కడి శిక్షను వేరే జైలుకు మార్చాలన్నా, ఆరోగ్య పరిస్థితులు అనుకూలించకపోయినా, పలు ప్రత్యేక సందర్భాలలో లేఖల రూపంలో పిటిషన్ వేయాల్సి ఉంటుంది.
బ్రిటిష్ అధికారులు పెట్టిన నిబంధన ప్రకారమే మన అభ్యర్థనను పేపరుపై నివేదించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే సావర్కర్ అక్కడి భారతీయ ఉద్యమ వీరుల స్థితిగతులను బ్రిటిష్ అధికారులకు లేఖల రూపంలో తెలియజేశారు. ఈ విషయం బ్రిటిష్ అధికారులు కూడా ఒప్పుకున్నారు.
సావర్కర్ లేఖలపై దుష్ప్రచారం
రాజకీయ కుట్రల కారణంగా సావర్కర్ లేఖలపై పనిగట్టుకుని కొందరు దుష్ప్రచారం ప్రారంభించారు. ఎద్దులు మాదిరిగా స్వాతంత్ర్యోద్యమ వీరులతో గానుగను తయారు చేయించేవారు. భయంకరమైన విషపూరిత దోమలు, క్రిమి కీటకాలు, విషపూరిత ప్రాణులు నివసించే గదులలో ఒంటరిగా బంధించేవారు.ఆ శిక్షలు సావర్కర్‌కి కూడా తప్పలేదు. కాబట్టి ఆ సందర్భంలో బ్రిటిష్ పాలకులకు ఘాటుగా లేఖలు రాశారు.
కూతవేటులో మరొక ఖైదీ కూడా కనిపించని, వినిపించని స్థితిలో ఒంటరితనంతో శిక్ష వేసేవారు. తినడానికి, మలవిసర్జన చేయడానికి ఒకే పాత్ర ఇచ్చేవారు. అందులోనే తినాలి, అందులోనే మలవిసర్జన చేసి దానిని శుభ్రం చేసుకోవాలి. ఇంతటి కఠిన కారాగార శిక్ష అనుభవించిన సావర్కర్‌పై విషం గక్కడం దేశ విద్రోహమే. 1911 నుంచి 1921 వరకు దాదాపు పదేళ్లు కాలాపాని జైలులో నిర్బంధపు చిత్రహింస అనుభవించారు.
‘దేశం కోసం జీవించడమే కాదు.. మరణించడం, మరణ సమానమైన బాధను భరించడమే నిజమైన దేశభక్తి’ అని నిరూపించిన భరతమాత ముద్దుబిడ్డ వినాయక దామోదర సావర్కర్. తత్వవేత్త ‘భారతరత్న ఒక వ్యక్తిని గొప్పవాడిగా చేయదు. వ్యక్తి గొప్పతనమే ఆ బిరుదుకు విలువ ఇస్తుంది’. దేశ స్వాతంత్ర్యోదమ త్యాగాల చరిత్రను పరిశీలిస్తే సావర్కర్ అందరికంటే ముందు వరుసలో నిలుస్తారు. సావర్కర్‌కు భారతరత్న ప్రదానం చేయాలని డిమాండ్ ఆయనను గొప్పవాడిని చేయడానికి కాదు, దేశం తన కృతజ్ఞతను వ్యక్తపరచడానికి మాత్రమే. స్వాతంత్ర్య పోరాటం అంటే చాలామందికి జైలు శిక్షల కథలు గుర్తుకు వస్తాయి.
కానీ సావర్కర్ విషయంలో అది కాలాపాని అనే నరకం. సావర్కర్ కేవలం ఖడ్గం పట్టిన విప్లవకారుడు కాదు, కాలం పట్టిన చరిత్రకారుడు, తత్వవేత్త. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆయుధ పోరాటం.. మేధోపోరాటం రెండింటిని సమాంతరంగా నడిపిన అరుదైన నాయకుడు సావర్కర్. కానీ చరిత్రను ఎంత వక్రీకరించినా కాలాపాని జైలుగోడలపై సావర్కర్ రాసిన రక్తపు అక్షరాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఉంటాయి. విప్లవం అంటే విధ్వంసం కాదు, అది జాతీయ చైతన్యం.. అని నిరూపించిన
సావర్కర్‌కు జేజేలు పలకాల్సిందే.
పగుడాకుల బాలస్వామి,
ధర్మాచార్య సంపర్క ప్రముఖ్,
విశ్వహిందూ పరిషత్, తెలంగాణ
NOTE : ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
