భారతీయ శిక్షాస్మృతి, 1860 అమల్లోకి వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. అందులోని సెక్షన్ 53 ప్రకారం ముద్దాయిలకు ఐదు రకాలైన శిక్షలను విధించడానికి అవకాశం ఉంది. అవి 1) మరణశిక్ష, 2) జీవిత ఖైదు, 3) జైలు శిక్ష..అది కఠిన కారాగార శిక్ష కావొచ్చు లేదా సాధారణ జైలుశిక్ష కావొచ్చు. 4) ఆస్తి జప్తు 5) జరిమానా. ఆ తరువాత భారత ప్రభుత్వం భారతీయ శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023ని తెచ్చింది. ఈ చట్టం 2025 జులై 1రోజు నుంచి అమల్లోకి వచ్చింది. శిక్షలకు సంబంధించి ఒక గణనీయమైన మార్పుని ఈ చట్టంలో తీసుకొచ్చారు. ఐదు రకాల శిక్షలు కాకుండా, మరో శిక్షని ఈ సంహితలో చేర్చారు.
అదే 'కమ్యూనిటీ సర్వీస్'. ఈ పదబంధాన్ని 4 (ఎఫ్) భారతీయ న్యాయ సంహితలో చెప్పారు. ఇది ఓ కొత్తరకమైన శిక్షా పద్ధతి. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత ప్రకారం..కమ్యూనిటీ సర్వీస్ అంటే కమ్యూనిటీ ప్రయోజనం కోసం చేసే సేవ. ఈ సేవ చేసినందుకుగాను శిక్ష పడిన వ్యక్తికి ఎలాంటి డబ్బును ఇవ్వరు. ఈ పదబంధాన్ని భారతీయ న్యాయ సంహితలో నిర్వచించలేదు.
ఈ శిక్ష ఉద్దేశ్యం..జైళ్ళల్లో ఖైదీల వల్ల ఎక్కువ రద్దీ ఉండకూడదని, ఇది ఒక ప్రత్యామ్నాయ శిక్షా విధానం. చిన్న చిన్న నేరాలు చేసిన వ్యక్తులకి ఈ శిక్షను న్యాయ సంహిత ప్రకారం విధించే అవకాశం ఉంది. వీటితోపాటు పరువు నష్టం కలిగించిన వ్యక్తులకి కూడా ఈ శిక్షను విధించే అవకాశం ఉంది.
చాలా దశాబ్దాల క్రితం 'కమ్యూనిటీ సర్వీస్'ని చట్టంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇండియన్ పీనల్ కోడ్ బిల్లు, 1978 ద్వారా దాన్ని ఓ శిక్షగా ఏర్పరిచే ప్రయత్నం జరిగింది. 1980–-83 ప్రాంతంలో ఇండియన్ జైలు కమిటీ తన నివేదికలో జైలు శిక్షలు విధించే విషయంలో లోపాలను చూపిస్తూ కమ్యూనిటీ సర్వీస్ లాంటి ప్రత్యామ్నాయాలను స్వీకరించాలని సిఫారసు చేసింది.
మలిమత్ కమిటీ కూడా కమ్యూనిటీ సర్వీస్ శిక్ష అమలు చేయాలని తన నివేదికలో సిఫార్సు చేసింది. ఇవి ఏవీ అమలుకి నోచుకోలేదు. కానీ మన దేశంలోని కోర్టులు కమ్యూనిటీ సర్వీస్ లాంటి ఉత్వర్వులని బెయిల్ షరతులుగా విధించడం మొదలుపెట్టాయి. అయితే, అది సరైనది కాదు. బెయిల్ షరతులు ఆ వ్యక్తి కోర్టుకి హాజరుకావడానికి ఉద్దేశించి ఉండాలి. అంతేకానీ శిక్ష మాదిరిగా ఉండటానికి వీల్లేదు.
బెయిల్ కోసం రాఖీ
బెయిల్ కోసం రాఖీ అన్న షరతులని మధ్యప్రదేశ్ హైకోర్టు అపర్ణాభట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో విధించింది. ఈ షరతు వివాదాస్పదం అయ్యింది. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని సోదరుడిగా మారుస్తుందన్న ఉద్దేశ్యంతో ఈ షరతుని మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ పథక్ విధించారు. ఈ షరతు అనేది బాధితురాలి గాయాన్ని తక్కువ చేసిందని, ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. బెయిల్ కోసం వచ్చిన వ్యక్తులకి చెట్ల పెంపకం, నీటి సేకరణ లాంటి షరతులని కోర్టులు విధించడం మొదలుపెట్టాయి. అది సరైంది కాదు. ఇప్పుడు ఇది భారతీయ న్యాయ సంహితలో 6వ శిక్షగా మారిపోయింది.
6 రకాల నేరాల శిక్షల్లో ‘కమ్యూనిటీ సర్వీస్’ శిక్షకూ అవకాశం
భారతీయ న్యాయ సంహిత ప్రకారం 6 రకాల నేరాలకు ఈ శిక్షను విధించడానికి అవకాశం ఉంది. అవి - చిన్న నేరాలు, మొదటిసారి నేరం చేసిన వ్యక్తులకి కావొచ్చు. అవి ....
- సెక్షన్ 202 - పబ్లిక్ సర్వెంట్స్ చట్ట వ్యతిరేకంగా వ్యాపారంలో ఉండటం, ఈ నేరానికి ఒక ఏడాది వరకు జైలు శిక్షనుగానీ లేదా జరిమానా గానీ లేదా రెండింటినీ గానీ లేదా కమ్యూనిటీ సర్వీస్‌ని కానీ కోర్టులు విధించవచ్చు.
- సెక్షన్ 209 - భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 84 ప్రకారం ప్రొక్లమేషన్ ఇచ్చినప్పటికీ దానికి అనుగుణంగా ఎవరైనా హాజరుకానప్పుడు వారికి మూడు ఏండ్ల వరకు జైలుశిక్షనుగానీ, లేదా జరిమానానిగానీ, లేదా రెండింటినీగానీ, లేదా కమ్యూనిటీ సర్వీస్‌ని గానీ కోర్టులు విధించవచ్చు.
- సెక్షన్ 226 - ఆత్మహత్యా ప్రయత్నం చేయడం లేదా ఎవరైనా చట్టపరమైన అధికారాన్ని చేయనివ్వకుండా చూడటం - ఈ నేరం చేసిన వ్యక్తులకి ఒక ఏడాది వరకు జైలుశిక్ష, లేదా జరిమానా, లేదా రెండింటినిగానీ, లేదా కమ్యూనిటీ సర్వీస్‌నిగానీ కోర్టులు విధించవచ్చు.
- సెక్షన్ 303 (2) ప్రొవిసో - దొంగతనం చేసిన వస్తువు విలువ రూ.5,000/-లలోపు ఉన్నప్పుడు, నేరం మొదటిసారి చేసినప్పుడు దాన్ని తిరిగి ఇచ్చినప్పుడు అతనికి కోర్టులు కమ్యూనిటీ సర్వీస్‌ని విధించవచ్చు.
- సెక్షన్ 355 - పబ్లిక్ ప్లేస్‌లో తాగి చెడు నడవడికతో ప్రవర్తించడం - ఇలాంటి వ్యక్తులకి 24 గంటల వరకు జైలుశిక్షని లేదా రూ.1000 వరకు జరిమానా లేదా రెండింటిని లేదా కమ్యూనిటీ సర్వీస్‌ని కోర్టు విధించవచ్చు.
- సెక్షన్ 356 - పరువు నష్టం, - ఈ వ్యక్తులకి కోర్టు 2 ఏండ్ల వరకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండింటినీ లేదా కమ్యూనిటీ సర్వీస్‌ని కోర్టు విధించవచ్చు.
భారతీయ న్యాయసంహితలోని సెక్షన్ 202, 209, 226, 355, 356 (2)ల ప్రకారం జరిగిన నేరాలకు కమ్యూనిటీ సర్వీస్ అనేది ఒక ప్రత్యామ్నాయ శిక్ష కావడంగా కన్పిస్తుంది. కానీ సెక్షన్ 303 (2) ప్రకారం దొంగతనం చేసిన వ్యక్తులకి కమ్యూనిటీ సర్వీస్ అనేది ప్రత్యామ్నాయ శిక్ష కాదు. కమ్యూనిటీ సర్వీస్ చేయడంలో ఎవరైనా విఫలమైతే విధించే జరిమానాల గురించి సంహితలో చెప్పలేదు.
సవాళ్ళు, లోపాలు
కమ్యూనిటీ సర్వీస్ అంటే 'సమాజానికి ప్రయోజనం చేకూర్చే పనిని' బి.యన్.ఎస్.ఎస్గానీ, బి.ఎస్.ఎ గానీ నిర్వచించలేదు.
కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏ పని అన్న విషయం చెప్పలేదు. కమ్యూనిటీ సర్వీస్‌ని శిక్షగా ఇవ్వాలా వద్దా అనేది న్యాయమూర్తుల విచక్షణాధికారంపై ఎక్కువ ఆధారపడి ఉంది. దీనివల్ల శిక్ష విధించడంలో అసమానతలు కలిగే అవకాశం ఉంది.
ఒకే నేరానికి న్యాయమూర్తి తన విచక్షణ ఆధారంగా వేర్వేరు శిక్షలు విధించే అవకాశం ఉంది. అలాగే, కమ్యూనిటీ సర్వీస్ ఎంతకాలం వరకు అన్న విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు లేవు. రెండేండ్ల జైలుశిక్ష అంటే రెండేండ్ల కమ్యూనిటీ సర్వీస్ అని అర్థమా? ప్రస్తుతానికి ఇది జవాబులేని ప్రశ్న.
ఏరకమైన సేవ
కమ్యూనిటీ శిక్ష స్వభావం పరిధి చెప్పలేదు. కమ్యూనిటీ సర్వీస్ అంటే ఎలాంటి సమాజసేవ..? గురుద్వారా లోని కరసేవలాంటిదా? రోజుకి ఎంత సమయం? రెండు గంటలు, నాలుగు గంటలు, ఆరు గంటలు దీనికి కాలమానం ఏమిటి? ఈ నిబంధన పూర్తిగా న్యాయమూర్తుల విచక్షణకి వదిలివేయడమైనది.
కమ్యూనిటీ సర్వీస్‌ని శిక్షగా విధించే విషయంలో ఎలాంటి మార్గదర్శకాలనూ చట్టంలో చూపించలేదు. అప్పుడు న్యాయమూర్తులు తమకు తోచిన పద్ధతిలో ఈ కమ్యూనిటీ సర్వీస్ శిక్షను విధించే అవకాశం ఉంది. కమ్యూనిటీ సర్వీస్ శిక్షను అమలు చేయడానికి, పర్యవేక్షించడానికి ఎటువంటి ఆదేశం లేదు. ఇది అనిశ్చితికు దారితీస్తుంది.
కోర్టు ఉత్తర్వులని ఎవరు అమలు చేస్తారు? జైలు శిక్షని తప్పించుకోవడానికి శిక్షపడిన వ్యక్తులు ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. ఈ లోపాలని కాలక్రమంలో రాజ్యాంగ కోర్టులు గానీ, శాసన కర్తలుగానీ, సరిచేసే అవకాశం ఉంది. కమ్యూనిటీ సేవ వల్ల చేసే నిర్ధిష్ట పనులని భారతీయ నాగరిక్ సుక్షా సంహితలోని సెక్షన్ 23లో పేర్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 'కమ్యూనిటీ సర్వీస్' అనేది సమర్థవంతంగా అమలు జరగాలంటే సరైన మార్గదర్శకాలు ఉండాలి. పర్యవేక్షించే మెకానిజమ్ ఉండాలి. ఆ శిక్ష దుర్వినియోగం కాకుండా ప్రజలకు అవగాహన పెరగాలి.
- డా. మంగారి రాజేందర్ జిల్లా జడ్జి (రిటైర్డ్) -
NOTE : ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
